Congress | తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ‘ఇందిరమ్మ రాజ్యం’ తీసుకువస్తామని చెప్తున్నారు. వారి ఉపన్యాసాలు విన్నప్పుడల్లా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం గుర్తుకువస్తున్నది. నేటి తరానికి ఇందిరమ్మ రాజ్యం గురించి తెలియకపోవచ్చు. కానీ, యాభై ఏండ్ల వయస్సు దాటిన వారందరికీ ‘ఇందిరమ్మ రాజ్యం’ బాగా తెలుసు.
ఆహారధాన్యాలకు కూడా అమెరికా వైపు ఆశగా చూసిన ఆకలి రాజ్యం రోజులవి. ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ, పీఎల్-170 స్కీమ్ కింద అమెరికా ఉచితంగా ఇచ్చే గోధుమలు, పాల పౌడర్ కోసం దేశం ఆశగా ఎదురుచూసిన రోజులవి. ఇప్పుడు ఆహారధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తం దేశం ఆకలి తీర్చేస్థాయిలో ఉన్న తెలంగాణలో ఆకలి కోసం విదేశాలు దానంగా ఇచ్చే ఆహారధాన్యాల కోసం ఎదురుచూసిన రోజులను తీసుకువస్తామన్నట్టు ఇందిరమ్మ కాలాన్ని ప్రచారంలో గుర్తుచేస్తున్నారు.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండేవో గుర్తుచేసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటూ మళ్లీ ఆ రోజులను గుర్తుకుతెస్తే భయం వేస్తున్నది. 1966-77 వరకు, తిరిగి 1980-84 వరకు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే 70-80ల కాలం నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటే, తిరిగి ఆ కాలం రావడమంటే ఊహించుకుంటేనే భయం వేస్తుంది. దాదాపు 91లో వచ్చిన ఆర్థిక సంస్కరణల కాలం వరకు పేదరికంలో కొట్టుమిట్టాడింది దేశం.
ఇందిరాగాంధీ ఈ దేశ ప్రధానిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఏపీలో రాజకీయ అస్థిరత రాజ్యమేలింది. ఏ ముఖ్యమంత్రిని ఏ రోజు ఇంటికి పంపిస్తారో తెలియదు. అలాంటి అరాచక పరిస్థితిలోనే సినీ నటుడు అయిన ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్‌కు నటునిగా ఉన్న గ్లామర్‌తో పాటు అప్పటి రాజకీయ అరాచక పరిస్థితి ఆ పార్టీని గెలిపించాయి. ఆ రోజుల్లో నెలల తరబడి కర్ఫ్యూ విధించేవారు. దవాఖానలకు వెళ్లి ఏ మతం వాళ్లు ఎంతమంది మరణించారో లెక్కలు పెట్టుకోవడం వంటి రాక్షస చర్యలు మాములే. రమీజాబీ ఉదంతంలో నగరం నెలల తరబడి కర్ఫ్యూలో మగ్గింది. కర్ఫ్యూలో పాఠశాలలు బంద్ కావడం, నెలల తరబడి ఇంటి వద్ద ఆడుకోవడం వంటి జ్ఞాపకాలు యాభై ఏండ్లు దాటినవారికి బాల్యం జ్ఞాపకాలుగా చెరగని ముద్ర వేయవచ్చు. కానీ, ఈ వయస్సులో నాటి భయానక పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో నివసించినవారు నాటి నరకాన్ని తప్పించుకొని ఎలా బయటపడ్డామా అనిపిస్తుంది.
ఒక్క శాంతిభద్రతలే కాదు, ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. వారానికి ఓ రోజు మంచినీళ్లు, నిత్యం విద్యుత్తు కోతలే. ఆవేశపరులైన యువత నక్సలిజాన్ని ఆశ్రయించిన కాలం ఇదే. సరిగ్గా ఈ సమయంలో వచ్చిన సినిమానే ఆకలిరాజ్యం. నిరుద్యోగ సమస్య యువతను నిర్వీర్యం చేసింది. నాటి యువత ఎలాంటి స్థితిలో ఉండేదో ఈ సినిమా అద్దం పట్టింది. ఆకలితో ఉన్న హీరో మోరీలో పడ్డ ఆపిల్ తీసుకొని తింటాడు. ఆకలి తీర్చుకోవడానికి తాను ఎంతో ఇష్టపడే శ్రీశ్రీ పుస్తకాలను తూకంలో అమ్మేస్తాడు.
ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలను మనవాళ్లు ఏలేస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే. చివరికి రెండు వందల ఏండ్లపాటు మనల్ని పాలించిన బ్రిటన్ను పాలిస్తున్నది మనవాళ్లే. మన యువత ఇప్పుడు ప్రపంచాన్ని దున్నేస్తుంటే ఆకలి రాజ్యాన్ని గుర్తుజేసే ఇందిరమ్మ రాజ్యం తెస్తామనడం ఎన్నికల్లో వర్కవుట్ కాదు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే వందల మందిని కాల్చిచంపి భయబ్రాంతులకు గురిచేసింది ఇందిరమ్మ రాజ్యం సాగుతున్న కాలంలోనే. నక్సలిజం, పేదరికం, కరువు, రాజకీయ అస్థిరత, కనీస వసతులు లేని జీవితం ఇదే కదా ఇందిరమ్మ కాలం నాటి జన జీవితం. ఇందిరమ్మ రాజ్యం సాగుతున్న కాలంలోనే ఎంకౌంటర్లలో వేలాదిమంది యువత బలయ్యారు. అలాంటి దయనీయమైన పరిస్థితులను గుర్తుకుతెచ్చే పాలనను తిరిగి తెస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఎలాంటి హామీనో. తెలంగాణ ఏర్పాటు తర్వాతనే తెలంగాణ గ్రామీణ జీవితం మెరుగుపడింది.
ఏ రాజకీయ పక్షమైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో, అధికారం అప్పగిస్తే ఇంకా మెరుగ్గా ఏం చేస్తారో చెప్పాలి. ఏ పార్టీ అయినా చేసేది అదే. కానీ, రాష్ట్రం వేగంగా దూసుకువెళ్తూ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుతూ సంక్షేమ పథకాల అమల్లో, రైతుబంధు, ఇంటింటికి మంచినీళ్లు వంటి పథకాలతో దేశానికే దారి చూపుతుంటే ఆకలిరాజ్యం కాలం నాటి ఇందిరమ్మ రాజ్యం తెస్తామనడం సరైన వ్యూహం అనిపించుకోదు. ఇంతకన్నా ఏ రంగంలో ఇంకా మెరుగ్గా చేయగలరో చెప్పగలిగితే చెప్పాలి. దాని కోసం తమ వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటో ప్రజలకు చెప్పాలి. అంతే తప్ప పోరాడి సాధించుకున్న, కష్టపడి అభివృద్ధి చేసుకున్న తెలంగాణను పాత రోజుల్లోకి తీసుకువెళ్తామని చెప్పడం సరైన వ్యూహం కాదు.
-బుద్దా మురళి