సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయిలో అగ్గిమీద గుగ్గిలమోలే తలపడే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో మాత్రం రహస్య దోస్తీతో రాజకీయ విలువలకు పాతరేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఆ రెండు పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించింది. కమలం మాత్రం ఇంకా పేరు ఖరారులో దోబూచులాడుతూనే ఉంది.
అయితే అభ్యర్థి ఎంపిక కోసం మూడు పేర్లు సెంట్రల్ కమిటీకి పంపిస్తున్నామని రాష్ట్ర నాయకత్వం చెప్పినప్పటికీ ఆ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనేక మంది ఆశావహులు ఉన్న హస్తం పార్టీలో అభ్యర్థి తేలేవరకు బీజేపీ వేచి చూడటం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనం. ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న రేవంత్ రెడ్డితో కిషన్ రెడ్డి కలిసిపోయి కమలానికి పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో చర్చిస్తుండటం విశేషం.
బీజేపీ నుంచి పోటీలో ఉండేందుకు లంకెల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, సుభాశ్ తదితరులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో దీపక్ రెడ్డి ప్రథమంగా నిలుస్తున్నాడు. కిషన్ రెడ్డి మద్దతు దీపక్ రెడ్డికే ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కిషన్ రెడ్డి చెప్పిన అభ్యర్థియే ఫైనల్ అంటూ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. అయితే పేరును ఖరారు చేయడానికి అధిష్ఠానం వేచి చూడటంపై దీపక్ రెడ్డి సైతం ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇంకా అభ్యర్థిని బీజేపీ ప్రకటించక పోవడంపై రాష్ట్ర నాయకత్వ లోపం కనిపిస్తుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పేరు ప్రకటిస్తే ప్రచారం చేసుకుంటామని చెబుతున్న అభ్యర్థుల గోడు మాత్రం అధిష్ఠానం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌కు రూట్ క్లియర్ చేసేందుకే బీజేపీ బరిలో చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీలు మహానగరంలో బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి జంకుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గమంతా గులాబీ దండుకు జై కొడుతూ కేసీఆర్ మళ్లీ రావాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే సింగిల్‌గా కుదరదనే లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్, బీజేపీలు రహస్యంగా మద్దతిచ్చుకుంటున్నాయని తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్, బీజేపీల రాజకీయ వికృత క్రీడకు నియోజకవర్గం తలవంచొదని.. బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని ఓటర్లు గళం విప్పుతుండటం విశేషం.