సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వాస్తవాల్ని తెలుసుకోమని అధిష్ఠానానికి చెబుతున్నా. నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేసిన.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసిన.. నగరాధ్యక్షుడిగా చేసిన.. కనీసం ఒక్క మాట చెప్పకుండా మంత్రులు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తరు.. అభ్యర్థి ఖరారులో కనీసం ఎవరికిస్తే బాగుంటుందని అడగరు. హుస్నాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేసినపుడు రాని స్థానికత జూబ్లీహిల్స్‌లో నాకే ఎందుకు వచ్చింది? గంపకింద కమ్మేసినరు కదా!’ ఇదీ.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన అంజన్‌ను శుక్రవారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. చాలాసేపు వారితో మాట్లాడిన తర్వాత మంత్రులు, అంజన్ మీడియా ముందుకు వచ్చారు.
అయినప్పటికీ అంజన్‌కుమార్ యాదవ్ మాత్రం ముభావంగానే కనిపించారు. మీడియాతో మంత్రులు మాట్లాడే సమయంలోనూ ఆయనలో అసహనం కనిపించింది. అనంతరం అంజన్ ప్రత్యేకంగా పలు మీడియా చానెళ్లతో మాట్లాడారు. ఆ సమయంలో తన అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా చేసిందెవరో తనకు తెలుసునని, ఆ కుట్రదారుల పేర్లు తర్వాత బయటపెడతానని హెచ్చరించారు. 40 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న తాను పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి జవాబుదారీగా ఉండాలా అని ప్రశ్నించారు. తాను గతంలో పలు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ అది తాను ఓడిపోయినట్లు కాదని.. తనను పార్టీలోని వాళ్లే ఓడగట్టారని అన్నారు. నా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నపుడు కనీసం నన్ను పిలవాల్సిన, సంప్రదించాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపై లేదా? అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పరోక్షంగా ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 18 మంది ఇన్చార్జీలను వేసిందని, ముగ్గురు మంత్రులను ప్రత్యేకంగా నియమించిందని అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. కానీ నగరం నడిబొడ్డున ఉన్న తనను కనీసం మాట వరసకైనా పిలవలేదన్నారు. తనకు సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారని మండిపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు నగరంలో తన కుటుంబమే పార్టీకి అండగా నిలిచిందని, ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనను తొక్కుకుంటూ పోతే… తాను ఎక్కుకుంటూ పోతానని హెచ్చరించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ (మంత్రి పొన్నం నియోజకవర్గం), కామారెడ్డి (సీఎం రేవంత్ పోటీ చేసిన నియోజకవర్గం)ల్లో రాని స్థానికత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తన విషయంలోనే ఎందుకు వచ్చిందని ఘాటుగా ప్రశ్నించారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసిన తాను రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చని, కేవలం తన గొంతు కోసేందుకే స్థానిక అనే అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఇది పార్టీని నమ్ముకున్న వారికి 200 శాతం అన్యాయం చేసినట్లేనన్నారు.
మంత్రి వివేక్ మినహా ఎవరూ తనను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారానికి పిలవలేదని, అయినప్పటికీ తానే ప్రజల్లోకి వెళ్లి చాలా కార్యక్రమాలు చేశానని అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. అభ్యర్థిని ఎంపిక చేయడంలో కనీసం తనను ఎవరూ సంప్రదించలేదని, చివరకు పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థి మర్యాదపూర్వకంగా తనను కలవలేదన్నారు. ఇప్పుడు రావాల్సిన అవసరంలేదని, సమయం మించిపోయిందని అంజన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అసలు పార్టీ అభ్యర్థిని ఎవరు ఖరారు చేశారు? ఓవైసీలు, ఖురేషీలు ప్రకటిస్తారా? అని తీవ్ర విమర్శ చేశారు. పార్టీలో పని చేసే వారికి సరైన స్థానం, గౌరవం లభించడంలేదని, పదవుల్లోనూ తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే తాను కార్యకర్తలతో సమావేశం కానున్నానని, వారితో చర్చించిన తర్వాత తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని అంజన్ స్పష్టం చేశారు.