సిటీబ్యూరో/పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 10 (నమస్తే తెలగాణ): నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కోటి రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రతి నిత్యం వందలాది మంది సిబ్బంది, వేలాది మంది సిబ్బంది కాలేజీ ఆవరణలో తిరుగుతుండడం, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉన్నా కాలేజీలోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు భారీగా నగదు అపహరించడం సంచలనం రేపుతుంది. ఇది ఇంటి దొంగల పనా…? కరుడు గట్టిన దొంగ, ఏపీ పోలీసుల కండ్లు గప్పి 15 రోజుల క్రితం పరారయిన బత్తుల ప్రభాకర్ పనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఎక్కడ సీసీ కెమెరాల హార్డ్డిస్క్లున్నాయి.. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలున్నాయానే విషయాన్ని తెలుసుకున్న తరువాతే దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో కల్వకుర్తి అధికార పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ విద్యా సంస్థలకు సంబంధించి కేఎన్‌ఆర్‌ఆర్, బీఆర్ఐఎల్, బీఆర్ఐజీ పేర్లతో ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీలు ఒకే చోట ఉన్నాయి.
ప్రస్తుతం ఈ కాలేజీలను ఎమ్మెల్యే కొడుకు దుర్గప్రసాద్రెడ్డి నిర్వహిస్తున్నాడు. ఈ మూడు కాలేజీలు పక్క పక్కనే ఉండడంతో కాలేజీలలో విద్యార్థుల నుంచి వసూలైన వివిధ రకాలై ఫీజులకు సంబంధించిన నగదు రూ. 1.07 లక్షలు బీఆర్ఐజీ(బ్రిలియంట్ గ్రూప్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ) అడ్మినిస్ట్రేషన్ గదిలో భద్ర పరిచారు. కాలేజీ నిర్వాహకుడైన దుర్గాప్రసాద్‌రెడ్డి అనారోగ్యంతో నాలుగు రోజుల నుంచి కాలేజీకి రాకపోవడంతో విద్యార్థుల నుంచి జమ అయిన నగదును నాలుగు రోజులుగా బ్యాంకులో డిపాజిట్ చేయలేదు.
ఈ డబ్బును శుక్రవారం డిపాజిట్ చేయాలని సిబ్బంది భావించారు. ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్ గదిలోని బీరువాలో డబ్బంతా జమ చేసి తాళం వేసి 9వ తేదీ సాయంత్రం ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు వచ్చి చూసే సరికి అడ్మినిస్ట్రేషన్ గది తాళాలు పగలగొట్టి ఉన్నాయి, లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన నగదంతా మాయమయ్యింది. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ వీరయ్య అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి సందర్శించారు.
కాలేజీలలో అంత పెద్ద మొత్తంలో డబ్బుందనే విషయంలో లోపలున్న సిబ్బందికే అవగాహన ఉంటుంది. బ్యాంకులో వేయకుండా కాలేజీలోనే దాచిపెట్టడంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కాని ప్రతి రోజు కాలేజీకి వచ్చిపోయే వారు ఎవరైనా కూడా అయి ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన కాలేజీ భవనం చుట్టూ 30 సీసీ కెమెరాలున్నాయి. సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండేలా ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు కొన్ని అనవాళ్లు సీసీ కెమెరాలలో పోలీసులకు లభ్యమయ్యాయి. వచ్చిన దొంగలు కాలేజీ వెనుక నుంచి వచ్చిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇది కాలేజీకి సంబంధించిన వారి పనే అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని పోలీసులు భావిస్తున్నారు.
ఏపీ చిత్తూర్ జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ 2013 నుంచి చోరీలు చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో కాలేజీలు, దవాఖానలను లక్ష్యంగా చేసుకొని లక్షల రూపాయలు కొట్టేస్తుంటాడు. కనీసం రూ. 300 కోట్లు దొంగతనం చేసి సంపాదించాలనే టార్గెట్‌తో దొంగతనాలు చేస్తుంటాడు. ఇలా 2022లోను పోలీసుల నుంచి పరారయ్యాడు. ఇదిలాఉండగా 2025 ఫిబ్రవరిలో కరుడుగట్టిన దొంగ సైబరాబాద్ పరిధిలోని ప్రిజం పబ్బులో ఉన్నాడనే పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ దొంగను పట్టుకోవడం కోసం సైబరాబాద్ పోలీసులు వల పన్నారు, పబ్బులోకి పోలీసులు తనను పట్టుకోవడానికి వచ్చారని గుర్తించి పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యాడు. కరుడుగట్టిన బత్తుల ప్రభాకర్‌ను సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలించి పట్టుకున్నారు. నిందితుడు ఏపీ పోలీసులకు కూడా మోస్ట్ వాంటెడ్ కావడంతో పీటీ వారెంట్‌పై జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. 15 రోజుల క్రితం ఏపీలోని రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ప్రభాకర్‌ను విజయవాడ కోర్టులో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్‌తో పోలీసులు తీసికెళ్లి తిరిగి జైలుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఒక హోటల్ వద్ద ఆగినప్పుడు తనకు మూత్రం వస్తుందని చెప్పి పోలీసుల అనుమతి తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. చేతికి సంకెళ్లు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని పట్టుకోవడం కోసం ఏపీ పోలీసులు 15 బృందాలతో గాలింపు చేపట్టారు. బ్రిలియంట్ కాలేజీలో పోలీసులకు లభించిన సీసీ కెమెరాలలో లభించిన ఆధారాలలో ఇద్దరు వ్యక్తులు కన్పించినట్లు తెలుస్తోంది. అందులోని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు వేసి గుర్తుపట్టుకుండా ఉన్నారు. అయితే ప్రభాకర్ చేసే మోడస్ అపరెండీలాగానే బ్రిలియంట్ కాలేజీలో కూడా జరగడంతో నిందితుడు బత్తుల ప్రభాకర్ కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో సేకరించిన ఫింగర్ ఫ్రింట్స్ను విశ్లేషిస్తున్నారు. విచారణలో ఈ దొంగతనం తెలిసిన వారి పనా..? పరారీలో ఉన్న బత్తుల పనా? కొంత దొంగల పనా ? అనే విషయాలు తేలనున్నాయి.