హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సమస్యలపై అధికారులు నివేదికలు సిద్ధంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయేతర భూముల సమస్యలపై మంత్రి కేటీఆర్, వ్యవసాయ భూములపై మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీలను నియమించింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని సబ్‌కమిటీ అనధికారిక లేఅవుట్లు, ఇండ్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠం తదితర సమస్యలపై దృష్టిసారించనున్నది. సబ్‌కమిటీలు త్వరలో భేటీ కా నున్న నేపథ్యంలో కిందిస్థాయి సమస్యలపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలపై నివేదికను సిద్ధంచేసినట్టు తెలిసింది. వ్యవసాయ భూములపై కూడా దృష్టిసారించారు. సీలింగ్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూ ములు, ఇతర ప్రభుత్వ భూములు, గతంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వ భూములు ఇప్పుడు నిషేధిత జాబితాలో కనిపిస్తే ఆ వివరాలు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, లీజులో ఉన్న భూములు, గ్రామ కంఠం భూములు, జీవో 166, జీవో 58 కింద క్రమబద్ధీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది ఆయా వివరాలను సేకరిస్తున్నారు. వాటిని జిల్లా స్థాయిలో క్రోడీకరించి, రాష్ట్రస్థాయికి పంపుతారని అధికారులు చెప్పారు.