భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29 : రానున్న 36 గంటల్లో వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వరద ప్రవాహం సమయంలో నదులు, వాగులు, కాలువలు, చెరువులు వంటి జలవనరుల వద్దకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని సూచించారు. అలాగే రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.