న్యూఢిల్లీ : వివాహ సమయంలో తన తల్లిదండ్రులు అందచేసిన నగదు, బంగారం, ఇతర బహుమతులను మాజీ భర్త నుంచి వాపసు తీసుకునే హక్కు విడాకులు పొందిన ముస్లిం మహిళకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాజీ భర్త నుంచి ఈ బహుమతులను తిరిగి పొందే హక్కు ఆమెకు లేదంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదాన్ని ఓ సివిల్ వ్యవహారంగానే కలకత్తా హైకోర్టు చూసిందే తప్ప 1986 చట్టం విస్తృత ఆశయాన్ని చూడలేదని అభిప్రాయపడింది. 2005లో ఓ ముస్లిం జంటకు వివాహమైంది. వైవాహిక స్పర్థల కారణంగా 2009 మే 7న భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. మనోవర్తి కేసును దాఖలు చేయడంతోపాటు గృహహింస కింద కూడా ఆమె ఫిర్యాదు చేసింది.
2011 డిసెంబర్ 13న విడాకులు మంజూరయ్యాయి. అనంతరం ఆ మహిళ వివాహ సమయంలో అత్తింటి వారికి ఇచ్చిన నగదు, బంగారం, గృహోపకరణాలు వాపసు చేయాలని కోరుతూ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు రాగా దీన్ని ఆమె భర్త కలకత్తా హైకోర్టులో సవాలు చేశారు. మహిళ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. నగదు, బంగారాన్ని ఆమె భర్త వాపసు చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది.