IND Vs SA | రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండు వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల విజయం సాధించింది. టీమిండియా విధించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఐడెన్ మార్కరమ్ సెంచరీ సాధించగా.. మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్ హాఫ్ సెంచరీలు చేయగా.. దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలు వృథా అయ్యాయి.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ తక్కువ స్కోర్‌కే వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కెరీర్లో గైక్వాడ్‌కు వన్డేల్లో రెండో సెంచరీ. 82 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 105 పరుగులు చేసి గైక్వాడ్ పెవిలియన్‌కు చేరాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీతో సెంచరీ చేశాడు.
93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేశాడు. విరాట్, రుతురాజ్ మూడో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. చివరలో కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో అలరించారు. ఆకట్టుకున్నాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి రవీంద్ర జడేజా (24) సహకారం అందించాడు. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. జైస్వాల్ (22), రోహిత్ (14), వాషింగ్టన్ సుందర్ (1) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్కు రెండు, బర్గర్, ఎన్గిడికి చెరో వికెట్ దక్కింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (8) తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యాడు. మరో ఓపెన్ ఐడెన్ మార్కరమ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ టెంబా బావుమాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 98 బంతుల్లో సిక్సర్లు, 10 ఫోర్ల సహాయంతో 110 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. టెంబా బావుమా 48 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్ సహాయంతో 46 పరుగులు చేశాడు. మాథ్యూ బ్రీట్జ్కే (68), డేవాల్ట్ బ్రేవిస్ అర్ధ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా బ్రేవిస్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 54 పరుగులు చేశాడు. టోనీ డి జోర్జీ (17) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా.. కార్బిన్ బాష్ (29), కేశవ్ మహరాజ్ (10) జట్టును గెలిపించారు.
టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు రెండు, ప్రసిద్ధ్ కృష్ణకు రెండు చెరో రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాకు చెరో వికెట్ దక్కింది. ఇక విజయంతో దక్షిణాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక మూడో వన్డే ఈ నెల 6న విశాఖపట్నంలో జరుగనున్నది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో విజేతగా నిలుస్తుంది. ఇప్పటికే స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైనా భారత జట్టు.. వన్డే సిరీస్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నది.