Supreme Court | సుప్రీంకోర్టులో బుధవారం ఓ మహిళా న్యాయవాది గందరగోళం సృష్టించగా.. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మహిళా న్యాయవాది విచారణకు పదే పదే అంతరాయం కలిగించగా.. సిబ్బంది ఆమె బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఓ కేసును విచారిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సదరు మహిళా న్యాయవాది బాబితాలో లేని కేసును బెంచ్ ముందు లేవనెత్తారు. ఢిల్లీలోని ఓ గెస్ట్‌హౌస్‌ల తన స్నేహితుల్లో ఒకరు హత్యకు గురయ్యారని.. గతంలో ఐఎఫ్ఆర్ నమోదు చేసేందుకు నిరాకరించిన అదే పోలీస్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించారని కోర్టుకు తెలిపారు. అయితే, కోర్టుకు సొంత నియమాలు ఉన్నాయని.. సరైన పద్ధతిలో పిటిషన్ దాఖలు చేయాలని మహిళా న్యాయవాదికి సీజేఐ సూచించారు.
దీనికి న్యాయవాది స్పందిస్తూ తాను డిప్రెషన్లో ఉన్నానని.. పిటిషన్ దాఖలు చేస్తానని ధర్మాసనానికి తెలిపారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నం చేసినా వినకుండా.. విచారణకు ఆటంకం కలిగించారు. దాంతో సీజేఐ అక్కడే ఉన్న సీనియర్ న్యాయవాదిని ఆమెకు సహాయం చేయాలని, ఆమెకు పిటిషన్ దాఖలు చేసే విధానంపై వివరించాలని ధర్మాసనం సూచించింది. అయినప్పటికీ ఆమె కోర్టులో మాట్లాడుతూనే ఉండడంతో మహిళా భద్రతా సిబ్బంది ఆమెను కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. మహిళా భద్రతా సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో న్యాయవాది బిగ్గరగా అరుస్తూ.. ‘నన్ను తాకొద్దు.. తప్పుగా ప్రవర్తించొద్దూ’ అంటూ బిగ్గరగా అరిచింది. దాంతో లైవ్ స్ట్రీమింగ్‌ను కొంతసేపు మ్యూట్ చేయాల్సి వచ్చింది. చివరకు భద్రతా సిబ్బంది ఆమెను కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్లింది.