రెండో త్రైమాసికంలో రిలయన్స్ పటిష్టమైన పనితీరును ప్రదర్శించడం సంతోషదాయకం. మా వ్యాపారాల్లో అంతర్గతంగా ఉన్న బలాన్ని ఈ ఫలితాలు రుజువుచేస్తున్నాయి. కొవిడ్ ముందస్తుస్థాయికంటే అధిక వృద్ధిని సాధించాం.
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికం వ్యాపారాల దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) విశ్లేషకుల అంచనాల్ని మించిన ఫలితాల్ని వెల్లడించింది. 2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 43 శాతం వృద్ధితో రూ.13,680 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.9,567 కోట్లు. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,273 కోట్లకంటే సెప్టెంబర్లో 11 శాతం పెరగడం గమనార్హం. కంపెనీ ఆదాయం సైతం 2020 సెప్టెంబర్ క్వార్టర్కంటే భారీగా 48 శాతం పెరిగి రూ.1,74,104కోట్లకు పెరిగింది. గతేడాది ఇదేకాలంలో ఇది రూ.1,16,195 కోట్లు. గతంలో ఏ త్రైమాసికంలో ఆర్జించని రీతిలో ఆదాయం, లాభాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాలతో పాటు రిటైల్, డిజిటల్ విభాగాలు గణనీయమైన వృద్ధి కనపర్చాయి. ముగిసిన త్రైమాసికంలో తమ వ్యాపారాలపై కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఏమీ పడలేదని శుక్రవారం ఆర్ఐఎల్ తెలిపింది.
రిలయన్స్ జియో అటు లాభాల్లోనూ దూకుడును ప్రదర్శిస్తున్నది. సంస్థ రూ.3,728 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆదాయం ఏడు శాతం వృద్ధిచెంది రూ.23,222 కోట్లకు చేరుకున్నది.
రిలయన్స్ అనుబంధ సంస్థయైన ‘రిటైల్’ గత త్రైమాసికానికిగాను రూ.45,450 కోట్ల ఆదాయంపై రూ.1,695 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆదాయంలో 11 శాతం పెరుగుదల కనిపించగా, నికర లాభంలో 74 శాతం వృద్ధిని కనబరిచింది.