హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఇక నుంచి కార్లు, బైక్‌లు కొనుగోలు చేసినవారు వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చేపట్టిన ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్ విజయవంతమవడంతో నేటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సాఫ్ట్వేర్ తయారుచేసి ప్రయోగాత్మకంగా పరీక్షించామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ‘ఎలివేట్ జెడ్ఎక్స్ ఎంటీ 4’ వీలర్‌కు రిజిస్ట్రేషన్ చేసి వాహనదారుకు సర్టిఫికెట్ అందజేసినట్టు చెప్పారు.
సాఫ్ట్వేర్ విజయవంతం కావడంతో శనివారం నుంచి కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్ కోసం యజమానులు రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే షోరూమ్‌ల వద్దే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. ఈ విధానం ప్రకారం అధీకృత డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. ఇన్వాయిస్, ఫారం- 21, ఫారం- 22, బీమా, చిరునామా రు జువు, వాహన ఫొటోలు అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నేరుగా స్పీడ్‌పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తా రు. ఈ సౌకర్యం బైక్‌లు, కార్లకే వర్తిస్తుందని, వాణిజ్య(ట్రాన్స్పోర్ట్) వాహనాలకు వర్తించదని తెలిపారు.