వికారాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన జిల్లాల పునర్విభజన అంశంతో వికారాబాద్ జిల్లా ప్రజల్లో గందరగోళం, అయోమయం నెలకొన్నది. 40 ఏండ్ల చిరకాల వాంఛను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెరవేర్చి వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా ను మళ్లీ మార్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని చేవెళ్లకు మార్చడంతోపాటు వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లా అని పేరు పెడతారని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లీకులు ఇస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల నియోజకవర్గాన్ని వికారాబాద్ జిల్లాలో కలుపుతారంటూ.. జిల్లా కేంద్రాన్ని చేవెళ్లకు మారుస్తారంటూ.. కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలను నారాయణపేట జిల్లాలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతుండడంపై జిల్లా ప్రజానీకం అయోమానికి గురువుతున్నది. వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ 30ఏండ్లపాటు ఉద్యమిం చి సాధించిన జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేందుకు ఆలోచన చేస్తుండడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వికారాబాద్ జిల్లా జోలికోస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా రు. వికారాబాద్ జిల్లాను మార్చే ఆలోచనను మార్చుకోకుంటే ఉద్యమానికి జిల్లాలోని ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులతోపాటు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు.
వికారాబాద్ జిల్లా ప్రజల 40 ఏండ్ల చిరకాల వాంఛను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెరవేర్చారు. పూర్వ రంగారెడ్డి జిల్లాను వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలుగా 2016లో ఏర్పాటు చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు చే యాలంటూ ఎన్నో ఏండ్లుగా వికారాబాద్ ప్రజలు ఉద్యమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ పట్టించుకోదు. అంతేకా కుండా జిల్లా అభివృద్ధికీ కృషి చేయలేదు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వికారాబాద్ ప్రజల ఆకాంక్షను గుర్తించి వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని వికారాబాద్.. జిల్లాగా ఏర్పాటైన అనంతరం ఎంతో ప్రగతి జరిగింది. ఉమ్మడి జిల్లాలో వికారాబాద్వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో కలెక్టర్‌కు తమ సమస్యలు విన్నవించాలంటే సోమవారం ప్రజావాణి వేదికగానే సమస్యలను విన్నవించేవారు. కేసీఆర్ పరిపాలనా సౌలభ్యంకోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కలెక్టర్‌తోపాటు మరో ఇద్దరు అదనపు కలెక్టర్లకు ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ నెలకు, రెండు నెలలకొకసారి మాత్రమే క్షేత్రస్థాయిలో పర్యటించేవారు.. ప్రస్తుతం కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లకు క్షేత్రస్థాయి పర్యటన తప్పనిసరిగా మారింది. ఉమ్మ డి జిల్లాలో బషీరాబాద్ మండల ప్రజలు కలెక్టరేట్కెళ్లి తమ సమస్యను విన్నవించి తిరిగి వెళ్లేందుకు ఒకరోజు సమయం పట్టేది.. కానీ, వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుండడంతో సత్వర న్యాయం జరుగుతున్నది.
జిల్లాల మార్పుపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. వికారాబాద్ జిల్లా జోలికోస్తే మరో ఉద్యమం తప్పదు. 40 ఏండ్ల వికారాబాద్ ప్రజల చిరకాల కోరికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెరవేర్చారు. మళ్లీ జిల్లాలను పునర్విభజిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేస్తే, వాటిని మార్చేందుకు కుట్ర చేయడం తగదు. వికారాబాద్ అంటేనే ఉద్యమాల గడ్డ.. జిల్లా జోలికి వస్తే అగ్నిగుండమే.
– డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు