లక్షెట్టిపేట, జనవరి 23 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మోదెలలో ఓ చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారనే సమాచారంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు విచారణ చేపట్టారు. మోదెలకు చెందిన ఎలుగటి తిరుపతి-ఎలుగటి కళావతి మూడేళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాలికను చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రక్షించి, ఆదిలాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.
మంచిర్యాలలోని తీగల్ పహాడ్ అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన పరిగిపండ్ల విజయలక్ష్మి(ఏ-1), లక్షెట్టిపేట మహాలక్ష్మివాడకు చెందిన బొజ్జ స్వరూప (ఏ-2) ఇటీవల, చిన్నారిని ఎలుగటి తిరుపతి-ఎలుగటి కళావతి దంపతులకు రూ. 2.50 లక్షలకు విక్రయించారు. ఈ క్రమంలో మోదెల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి విజయలక్ష్మి, స్వరూపను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, రిమాండ్కు తరలించారు.
మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ గోపతి సురేశ్, సిబ్బంది శ్రీకాంత్, మల్లేశ్, బగ్గని సత్యనారాయణ, ఎంబడి సత్యనారాయణ, మురళి, ప్రవళికను సీఐ అభినందించారు.