(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రైతన్నల ఆత్మహత్యలు ఒకవైపు.. నిరుద్యోగుల నిరసనలు మరోవైపు.. పరిపాలనా వైఫల్యాలు ఇంకోవైపు.. అంతర్గత కుమ్ములాటలు మరోవైపు.. వీటికితోడూ కొత్తగా స్కామ్‌లు.. వెరసి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సకల జనులు అరిగోస పడుతున్నారు. అయితే, హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఎప్పటిలాగే డైవర్షన్ పాలి‘ట్రిక్స్’కు తెరతీశారని, తమ పాలనా వైఫల్యాలు, స్కామ్‌లను కప్పిపుచ్చుకొనేందుకు ‘ఫోన్ ట్యాపింగ్’ అనే అంశాన్ని మరింత సా..గదీసి, లేని దాన్ని ఉన్నట్టు చూయించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇందులో భాగంగానే మొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సిట్ 7-8 గంటలపాటు ప్రశ్నించింది. అయితే, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ తెర మీదికి తెచ్చిన ‘ట్యాపింగ్’ అస్త్రం ఇప్పుడు ఆ పార్టీకే ఎదురుతన్నింది. యూపీఏ పాలనలో ఫోన్ ట్యాపింగ్ నిత్యకృత్యంగా జరిగినట్టు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అప్పటి పత్రికల క్లిపింగ్స్‌తో ఈ పోస్టులు వైరల్‌గా మారడంతో.. ‘ట్యాపింగ్‌కు పేటెంట్ రైట్ కాంగ్రెస్‌దే కదా!’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘ఫోన్ ట్యాపింగ్’పై అనవసర రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ట్యాపింగ్ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ హయాంలో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు వ్యాపారవేత్తల ఫోన్లను సైతం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని పేర్కొంటూ 2010 మే 3న ఇంగ్లిష్ వీక్లీ మ్యాైగ్జెన్ ‘అవుట్ లుక్’ ఓ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. జేడీయూ అధినేత, బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్ పవార్) అధినేత శరద్‌పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్, సీపీఎం సీనియర్ నాయకుడు ప్రకాశ్‌కారత్ సహా అప్పటి టాటా గ్రూప్ చైర్మన్, దివంగత రతన్ టాటా ఫోన్లను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసినట్టు అవుట్‌లుక్ ఈ కథనంలో వెల్లడించింది. దీనిపై ప్రభుత్వం నుంచి పత్రికా ప్రతినిధులు స్పందన కోరగా.. ట్యాపింగ్ జరుగలేదని ఆ వార్తలను సూటిగా ఖండించలేదు. దీంతో ట్యాపింగ్ జరిగినట్టు పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.
అవుట్‌లుక్ బయటపెట్టిన ట్యాపింగ్ అంశం అధికార, విపక్ష పార్టీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అలా రెండేండ్లూ వార్తల్లో కొనసాగింది. ఇదే క్రమంలో ‘యూపీఏ-2 హయాంలో ఫోన్ల ట్యాపింగ్ జరిగిందా?’ అని ఢిల్లీకి చెందిన ప్రొసేన్‌జిత్ మోండల్ అనే హక్కుల కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద 2013 ఆగస్టు 6న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వివరాలు కోరారు. దీనిపై స్పందించిన హోంశాఖ.. ప్రతినెలా 7,500 నుంచి 9,000 ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు, అలాగే 300-500 ఈ-మెయిల్స్‌ను చదువుతున్నట్టు సమాధానమిచ్చింది. ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ఏయే ఏజెన్సీలకు అధికారం ఇచ్చారని స్వామీ అమృతానంద్ దేవ్తిరథ్ అనే హక్కుల కార్యకర్త డిసెంబర్ 24, 2013లో మరో ఆర్టీఐ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన అప్పటి హోంశాఖ.. మొత్తం తొమ్మిది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ట్యాపింగ్ చేసే అధికారాన్ని ఇచ్చినట్టు వెల్లడించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీడీటీ, ఈడీతోపాటు పలు ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నట్టు వివరించింది.
నీరా రాడియా కేసు సాకుతో తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని రతన్ టాటా 2013లో అప్పటి యూపీఏ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఈ చర్యలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్న టాటా.. ఇలాంటి చర్యలను ప్రశ్నించాల్సిందేనని స్పష్టంచేశారు. ఐదువేల గంటలపాటు తాను మాట్లాడిన మాటలను యూపీఏ ప్రభుత్వం విన్నదని, కచ్చితంగా రాజకీయ దురుద్దేశంతోనే ఇది చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వ చర్యలను మేధావులు, నిపుణులు, హక్కుల కార్యకర్తలు ఖండించారు. అయితే, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ ట్యాపింగ్ కేసుపై అంతగా దృష్టిపెట్టకపోవడంతో నీరుగారిపోయింది. కాగా, ‘ఫోన్ల ట్యాపింగ్’పై ఇప్పుడు గొంతు చించుకొంటున్న రాష్ట్ర కాంగ్రెస్.. తమ హయాంలో జరిగిన ఫోన్ల ట్యాపింగ్‌పై నోరెత్తకపోవడం విమర్శలకు దారితీస్తున్నది.