షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 22: రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ మార్చాలని.. లేదంటే రైతులతో కలిసి విస్తృతంగా ఆందోళనలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఫారుక్‌నగర్ మండలంలోని అయ్యవారిపల్లి, చించోడ్, బీమారం, ఉప్పరిగడ్డ తండా పరిసర ప్రాంతాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రీజినల్ రింగ్‌రోడ్డు కోసం మొదటిసారి చేసిన అలైన్మెంట్ ప్రకారమైతే రైతులు తమ భూములను నష్టపోయే పరిస్థితి లేదని అన్నారు.
అయితే కాంగ్రెస్ నాయకులు వారి స్వలాభాల కోసం అలైన్మెంట్ మార్చడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కొత్తగా ఇచ్చిన మార్కింగ్‌తో 300 మంది చిన్న,సన్నకారు రైతులు నష్టపోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాత అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ జరపాలని కోరారు.