Red Onions Vs White Onions | మనం ఉల్లిపాయలను రోజువారి ఆహారంలో భాగంగా తింటూనే ఉంటాం. కూరల్లో ఉల్లిపాయలను వేస్తుంటాం. ఉల్లిపాయలను వేయకపోతే కూరలు పూర్తి కావు. అయితే మనం ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలనే వాడుతుంటాం. కానీ మార్కెట్ లో మనకు తెల్ల ఉల్లిపాయలు కూడా లభిస్తుంటాయి. వీటినే కొందరు తెల్ల గడ్డలు అని కూడా పిలుస్తారు. అయితే ఎర్ర ఉల్లిపాయలు, తెల్లవి.. రెండింటిలో వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి, ఏవి మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి..? వేటిని మనం ఆహారంలో భాగం చేసుకోవాలి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయల్లో మనకు అందుబాటులో ఉన్నవి ఎరుపు, తెలుపు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వెరైటీలకు చెందిన ఉల్లిపాయలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆల్లియం అనే జాతికి చెందిన కూరగాయలు. ఇవి ఉండే రంగును బట్టి వీటిల్లోని పోషకాల శాతం మారుతుంది.
తెల్ల ఉల్లిపాయలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. కానీ ఉడికిస్తే కాస్త తియ్యగా మారుతాయి. తెల్ల ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్, క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. తెల్ల ఉల్లిపాయలను ప్రీ బయోటిక్ ఆహారంగా చెప్పవచ్చు. అంటే వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. తెల్ల ఉల్లిపాయలను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించి బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తెల్ల ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి తెల్ల ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి.
తెల్ల ఉల్లిపాయల్లో ఉండే క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వయస్సు మీద పడిన వారు తెల్ల ఉల్లిపాయలను తింటుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అయితే తెల్ల ఉల్లిపాయలతో పోలిస్తే ఎర్ర ఉల్లిపాయల్లోనూ పోషకాలు అధికంగానే ఉంటాయి. కనుక పోషకాల శాతం మారుతుంది. తెల్ల ఉల్లిపాయలతో పోలిస్తే ఎర్ర ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్ల శాతం అధికంగా ఉంటుంది. కనుక రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఎర్ర ఉల్లిపాయలను తినాలి. పచ్చిగా తినాలన్నా, ఘాటుదనం కోరుకున్నా తెల్ల ఉల్లిపాయలను తినాల్సి ఉంటుంది.
ఎర్ర ఉల్లిపాయలను చాలా మంది వంటల్లో వేస్తుంటారు. తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా నేరుగా తింటారు. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, షుగర్ లెవల్స్ తగ్గాలన్నా తెల్ల ఉల్లిపాయలను తినాల్సి ఉంటుంది. ఇలా ఆయా ఉల్లిపాయలు భిన్న రకాల పోషకాలను కలిగి ఉండి భిన్న రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇక ఏ ఉల్లిపాయ అయినా సరే కొన్ని పోషకాలు మాత్రం వాటిల్లో కామన్‌గా ఉంటాయి. అవేమిటంటే.. 100 గ్రాముల ఉల్లిపాయల్లో 40 క్యాలరీల శక్తి ఉంటుంది. పిండి పదార్థాలు 9.3 గ్రాములు, ఫైబర్ 1.7 గ్రాములు, ప్రోటీన్లు 1.1 గ్రాములు, విటమిన్ సి, బి6, పొటాషియం ఉంటాయి. ఇలా ఆయా ఉల్లిపాయల్లో మనకు కొన్ని రకాల పోషకాలు కామన్ గా లభిస్తాయి. అయితే ఎవరి అభిరుచి మేరకు వారు ఏ ఉల్లిపాయలను అయినా సరే తినవచ్చు. దీంతో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.