న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి(R Venkataramani) మళ్లీ అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆర్ వెంకటరమణిని అటార్నీ జనరల్‌గా నియమించేందుకు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయశాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆయన రెండేళ్ల పాటు అటార్నీ జనరల్‌గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన మూడేళ్ల పదవీ కాలం ముగియనున్నది. ఆర్ వెంకటరమణి వయసు 75 ఏళ్లు. సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ స్థానంలో వెంకటరమణి 2022, సెప్టెంబర్ 30వ తేదీన బాధ్యలు స్వీకరించారు.
అటార్నీ జనరల్ అనేది రాజ్యాంగపరమైన హోదా. కేంద్ర క్యాబినెట్ పంపే ప్రతిపాదన ఆధారంగా రాష్ట్రపతి ఆ వ్యక్తిని నియమిస్తారు. దేశంలోని ఏ కోర్టులోనైనా హాజరయ్యే హక్కు అటార్నీ జనరల్‌కు ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు అనేక రాష్ట్రా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలకు ఆర్ వెంకటరమణి పనిచేశారు. న్యాయపరమైన అంశాల్లో అటార్నీ జనరల్ ప్రభుత్వానికి సలహా ఇస్తుంటారు.
1950, ఏప్రిల్ 13వ తేదీన పుదుచ్చరిలో ఆయన జన్మించారు. 1977 జూలైలో ఆయన తమిళనాడు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. 1979లో ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టారు. 1997లో సుప్రీంకోర్టు ఆయన్ను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. లా కమీషన్లో మాజీ సభ్యుడిగా చేశారు. రాజ్యాంగపరమైన చట్టంలో ఆయన నిష్ణాతులు.