పండ్లు, కూరగాయల జ్యూస్‌లలో పోషకాలు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. అందుకే.. చాలామంది పండ్ల రసాలను తాగుతుంటారు. వాటన్నిటికన్నా.. ‘ఏబీసీ జ్యూస్’ మరింత ప్రయోజనం చేకూరుస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.
ఏబీసీ జ్యూస్ అంటే.. ఆపిల్ (ఏ), బీట్రూట్ (బీ), క్యారెట్ (సీ).. ఈ మూడింటినీ కలిపి జ్యూస్ చేసుకోవడం. అనేక పోషకాలతో నిండిన ఈ పండ్లు, కూరగాయలు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. వీటిలోని ప్రతి ఒక్కటీ.. దేనికదే ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆపిల్.. విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. బీట్రూట్.. నైట్రేట్స్, ఐరన్‌ను అందిస్తుంది. ఇక క్యారెట్లో డైటరీ ఫైబర్, బీటా కెరోటిన్ అధికంగా లభిస్తుంది. ఈ మూడిటినీ కలిపి తీసుకోవడం ద్వారా.. రుచితోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందుతాయి.
ఏబీసీ జ్యూస్‌లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గట్ బ్యాక్టీరియా, గ్యాస్ట్రిక్ ఆమ్లాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. శరీరం ముఖ్యమైన పోషకాలను గ్రహించడానికి సాయపడుతుంది.
ప్రతిరోజూ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. యాపిల్స్, క్యారెట్లలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని, వాటి పనితీరునూ మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇక బీట్రూట్లోని బీటా కెరోటిన్.. రోగనిరోధక కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది.
తక్కువ కేలరీలు, అధిక పోషకాలు, ఫైబర్ ఉండటం వల్ల.. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఏబీసీ జ్యూస్ దివ్యౌషధమే! ఇది ఆకలి, జీవక్రియను నియంత్రించడంలో సాయపడుతుంది.
ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడుకోవాలన్నా.. ఏబీసీ జ్యూస్ తాగాల్సిందే! యాపిల్స్, క్యారెట్లలో విటమిన్ సి, ఎ అధికంగా లభిస్తాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, చర్మంపై ముడతలను నివారిస్తాయి. అకాల వృద్ధాప్యాన్ని అరికడతాయి. బీట్రూట్లో ఉండే బీటాలైన్లు.. పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి.