Goji Berries | ఎరుపు రంగులో ఉండే పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి పండ్లను తినేందుకు అందరూ ఆసక్తిని చూపిస్తుంటారు. ఎరుపు రంగు పండ్లు మనకు మార్కెట్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో గోజీ బెర్రీలు కూడా ఒకటి. ఇవి చూసేందకు అచ్చం ఎరుపు రంగులో ఉండే ఈత పండ్లలా ఉంటాయి. అయితే ఈ పండ్లను చూస్తే వీటిని తినాలా, వద్దా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. కానీ గోజీ బెర్రీలను తినవచ్చు. ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు. ఈ పండ్లను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లను సూపర్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. గోజీ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని చైనీస్ సంప్రదాయ వైద్య విధానంలో విశ్వసిస్తారు. అందుకనే ఈ పండ్లను ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది వాడుతుంటారు కూడా. ఇక ఈ పండ్లతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోజీ బెర్రీలలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలి శాకరైడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించవచ్చు. గోజీ బెర్రీలలో జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది. దీని వల్ల అతినీలలోహిత కిరణాల బారి నుంచి కళ్లకు రక్షణ లభిస్తుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్లు ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. వీటి వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలను తగ్గేలా చేస్తుంది.
లివర్, కిడ్నీల ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. గోజీ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే లివర్, కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. ఆయా భాగాల్లో ఉండే టాక్సిన్లు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఆయా అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. డ్యామేజ్ అవకుండా రక్షించుకోవచ్చు. గోజీ బెర్రీలను తింటే శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. గోజీ బెర్రీలలో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల బారి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా మారుతారు.
గోజీ బెర్రీలను నేరుగా తినవచ్చు. లేదా ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ మనకు అందుబాటులో ఉంటాయి. 28 గ్రాముల (1 ఔన్సు) గోజీ బెర్రీలను తింటే సుమారుగా 98 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 21.6 గ్రాములు, ఫైబర్ 3.6 గ్రాములు, చక్కెర 12.8 గ్రాములు, ప్రోటీన్లు 4 గ్రాములు లభిస్తాయి. ఈ పండ్లలో విటమిన్లు ఎ, సిలతోపాటు ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. గోజీ బెర్రీలు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో కిస్మిస్ల మాదిరిగా ఎక్కువగా లభిస్తాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. మీరు రోజూ తినే తృణ ధాన్యాలు లేదా ఓట్ మీల్ వంటి వాటిలో కూడా కలిపి తినవచ్చు. స్మూతీల తయారీలో ఉపయోగించవచ్చు. అయితే గోజీ బెర్రీలను ఎవరైనా తినవచ్చు, కానీ రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు, హైబీపీ ఉన్నవారు, అలర్జీలు ఉన్నా, గర్భిణీలు ఈ పండ్లను తినకూడదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ గోజీ బెర్రీలను తింటే అనేక లాభాలను పొందవచ్చు.