ఐపీఎల్ రేంజ్ ఏందో మరోసారి తెలిసొచ్చింది. ప్రపంచంలో అత్యంత ధనిక లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్లో క్రికెటర్లపై కనక వర్షం కురిసింది. జెడ్డా(సౌదీఅరేబియా) వేదికగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో దాదాపు అందరి అంచనాలకు అనుగుణంగానే రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ జాక్‌పాట్ కొట్టారు. ఢిల్లీ నుంచి బయటకు వచ్చిన పంత్‌ను ఏకంగా 27 కోట్లతో లక్నో కైవసం చేసుకుంది. సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరగా రికార్డుయ్యింది. ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను 26.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. పంత్, అయ్యర్‌కు మధ్య కేవలం 25 లక్షల తేడానే. అసలు ఎవరి ఊహాకందని విధంగా కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ 23.75కోట్లకు తిరిగి అదే జట్టు తీసుకోగా, అర్ష్‌దీప్‌సింగ్, యజువేంద్ర చాహల్ 18 కోట్లతో పంజాబ్ జట్టులోకి వచ్చారు. మహమ్మద్ షమీ..హైదరాబాద్‌కు రాగా, మియాభాయ్ సిరాజ్.. ఆర్సీబీ నుంచి గుజరాత్‌కు మారాడు. మొత్తంగా వేలం తొలి రోజే రికార్డులు బద్దలయ్యాయి.
IPL | జెడ్డా: ఐపీఎల్ ప్రతిష్ఠ అంతకంతకూ పెరుగుతున్నది. బీసీసీఐకి కాసుల పంట పండిస్తున్న ఐపీఎల్ మరోమారు వేలం ద్వారా ప్రపంచానికి విలువేంటో చూపెట్టింది. ఆదివారం జరిగిన లీగ్ వేలం తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. ఆక్షనీర్ మల్లికా సాగర్ నేతృత్వంలో జరిగిన వేలంలో పది ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు రిటైన్ ద్వారా కొంత మంది క్రికెటర్లను తీసుకోగా, మిగిలిన వారి కోసం వేలంలోకి ప్రవేశించాయి. మొదటి రోజు వేలంలో మొత్తం 84 మంది ప్లేయర్లు రాగా ఇందులో 72 మందిని వేర్వేరు జట్లు కొనుగోలు చేయగా, 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలారు. రెండో రోజు సోమవారం మిగిలిన ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. ఇందులో అన్క్యాప్డ్ ప్లేయర్లతో పాటు అన్‌సోల్డ్‌గా నిలిచిన ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించిన శ్రేయాస్ అయ్యర్ వేలంలో హాట్‌కేకులా మారాడు. తొలి నుంచి పంజాబ్, ఢిల్లీ..అయ్యర్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా పోటీని నడిపించాయి. ఒకరిని మించి ఒకరు పెంచుకుంటూ పోవడంతో ఐపీఎల్లో అత్యధిక ధర రికార్డు (స్టార్క్-24.75కోట్లు)ను అయ్యర్ దాటేశాడు. ఆఖరి వరకు ఢిల్లీ పోటీపడ్డా పంజాబ్ 26.75 కోట్లతో తమ వశం చేసుకుంది.
రిటెన్షన్‌లో కేకేఆర్ వదులకున్న వెంకటేశ్ కోసం వేలంలో ఊహించని రీతిలో పోటీ ఏర్పడింది. మొదటి నుంచే లక్నో, కేకేఆర్ తమ ప్రయత్నాలు ప్రారంభించగా, మధ్యలో ఆర్సీబీ వచ్చింది. దీంతో అయ్యర్ రేటు ఒక్కసారిగా 14 కోట్లకు చేరుకోగా, ఆర్సీబీ తప్పుకోగా, కేకేఆర్ తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. అయితే మళ్లీ ఆర్సీబీ..మొగ్గుచూపగా ధర అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఒక దశలో పోటీ రసవత్తరంగా సాగింది. చివర్లో కేకేఆర్ 23.75 కోట్లతో తిరిగి తమ జట్టులోకి తీసుకుంది. గత సీజన్లో కోల్‌కతా ఐపీఎల్ టైటిల్ గెలువడంలో అయ్యర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. శ్రేయాస్ నిష్క్రమణతో వెంకటేశ్.. కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.
ఆదివారం ఐపీఎల్ మెగావేలం-2025 యువ పేసర్ అర్ష్దీప్సింగ్తో మొదలైంది. అర్ష్‌దీప్‌ను తమ సొంతం చేసుకునేందుకు ఢిల్లీ, చెన్నై పోటీలోకి వచ్చాయి. ఇటీవలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ దక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సింగ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఒక దశలో గుజరాత్, ఆర్సీబీ కూడా రేసులోకి వచ్చాయి. అనూహ్యంగా హైదరాబాద్ 15.75 కోట్లతో బిడ్ వేసింది. ఇక హైదరాబాద్‌కే అనుకున్న తరుణంలో పంజాబ్..రైట్ టు మ్యాచ్ కింద 18 కోట్లతో అర్ష్‌దీప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
రికార్డు ధర పలుకుతాడనుకున్న రాహుల్ 14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది. ఇక సీనియర్ స్పిన్నర్ చాహల్‌ను 18 కోట్లతో పంజాబ్ కింగ్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఆర్సీబీ స్పీడ్‌స్టర్ సిరాజ్ 12.25 కోట్లతో గుజరాత్ సరసన చేరాడు. సీనియర్ పేసర్ షమీ 10కోట్లతో హైదరాబాద్‌కు రాగా, 15.75 కోట్లతో బట్లర్ గుజరాత్‌కు మారాడు. స్టార్క్ ఈసారి 11.75 కోట్లతో ఢిల్లీ జట్టులో చేరాడు. ఇషాన్‌కిషన్‌ను 11.25 కోట్లతో హైదరాబాద్ దక్కించుకుంది. జితేశ్శర్మ(11.00), హాజిల్‌వుడ్(12.50 కోట్లు), సాల్ట్(11.05 కోట్లు) ఆర్సీబీ సొంతం చేసుకుంది.
అదృష్టం అంటే రిషబ్ పంత్‌దే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు కోరల్లో నుంచి బయటపడ్డ పంత్ తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఢిల్లీతో తెగదెంపులు చేసుకుని వేలంలోకి వచ్చిన పంత్‌కు అనుకున్నట్లే రికార్డు ధర పలికింది. లక్నో, ఆర్సీబీ, లక్నో జట్లన్నీ పంత్ కోసం పోటీపడ్డాయి. ఒకానొక దశలో ఢిల్లీ ఆర్టీఎమ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నించినా..లక్నో 27 కోట్లతో పంత్‌ను తమ ఖాతాలో వేసుకుంది.