Summer | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు రాష్ర్టానికి తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ-గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ జిల్లాల్లో భానుడు నిప్పులు కకుతున్నాడు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మునుగోడు, వేములపల్లి, యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నట్టు వాతావరణ విభాగం ప్రకటించింది.
ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. ఆదివారం మరింత తీవ్రస్థాయికి చేరినట్టు అధికారులు తెలిపారు. గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనంతగా.. సాధారణం కన్నా 6.1 డిగ్రీలు అదనంగా నమోదైనట్టు చెప్పారు. 42.8 డిగ్రీల ఎండ కాస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. సోమవారం వనపర్తి, జోగులాంబ-గద్వాల జిల్లాలో అకడకడా వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో కన్నెబోయిన కోటమ్మ (50), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్భగల్లికి చెందిన చిన్న పోశెట్టి (52) వడదెబ్బకు గురై చనిపోయారు.
కొత్తకోటలో 44.3 డిగ్రీలు
వనపర్తి జిల్లాలో సూరీడు సుర్రుమంటున్నాడు. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం కొత్తకోటలో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం ప్రజలు శీతల పానీయాలతో సేదతీరుతున్నారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
నాలుగు రోజులు వర్ష సూచన
తీవ్రమైన ఎండలతో ఉకిరిబికిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలగనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాలుగురోజులు వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ పేరొన్నది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకడకడా వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.