ముంబై: ఐపీఎల్-18లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్‌కు శుభవార్త. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని ముంబై తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. హార్దిక్ సేన నేడు (మే 7న) వాంఖడే వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడనుండగా ఈ పోరులో బుమ్రా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా పెర్త్‌లో జరిగిన ఐదో టెస్టులో గాయపడ్డ బుమ్రా.. ఇన్నాళ్లూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో పునరావాసం పొందాడు. బీసీసీఐ కూడా రెండ్రోజుల క్రితమే బుమ్రా బౌలింగ్ చేయడానికి క్లీయరెన్స్ ఇచ్చింది. అయితే బుమ్రా బెంగళూరుతో ఆడతాడా? లేక ఈనెల 17న హైదరాబాద్‌తో మ్యాచ్ వరకు ఆగుతాడా? అనేది నేడు తేలనుంది.