‘రాష్ట్ర సర్కారు పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేస్తున్న తరుణంలో యువత నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రిపరేషన్ ఉండాలి. ఒక్కో సబ్జెక్ట్‌కు కొంత టైం కేటాయించుకొని షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగితే.. కచ్చితంగా అలాంటి వారినే కొలువు వరిస్తుంది’ అని పలువురు వక్తలు నిరుద్యోగ యువతీ యువకులకు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, శాతవాహన యూనివర్సిటీ సంయుక్తంగా యువతకు ఉద్యోగాల సాధనపై నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అభ్యర్థులు హాజరుకాగా, గార్డెన్ కిక్కిరిసింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం, గురుకులాల అడిషనల్ సెక్రటరీ హనుమంతు నాయక్, తదితర ప్రముఖులు హాజరై, సందేశమివ్వగా, యువతలో ఉత్సాహం వెల్లివిరిసింది. –
కమాన్‌చౌరస్తా/ కొత్తపల్లి, మార్చి 20: ‘ప్లానింగ్ ఉంటే కొలువు మీదే. చక్కటి ప్రణాళిక, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రిపరేషన్ ఉంటే జాబ్ గ్యారెంటీ’ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం కరీంనగరంలోని శుభం గార్డెన్స్‌లో తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, శాతవాహన యూనివర్సిటీ సంయుక్తంగా యువతకు ఉద్యోగాల సాధనపై నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అభ్యర్థులు తరలివచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం, గురుకులాల అడిషనల్ సెక్రటరీ హనుమంతు నాయక్, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, రావుల గిరిధర్ ఐపీఎస్, ఆర్టీవో అఫ్రిన్ సిద్ధికి, ఏటీవో నునావత్ నవీన్‌కుమార్, నూతనకంటి వెంటన్, వేణుమాధవరెడ్డి, పోరిక రావు, నాగరాజు, పల్లికొండ నరేశ్, నవీన్‌కుమార్, రామకృష్ణ, దమ్మని రాము, శ్రీకాంత్ సట్ట, చిరంజీవి, విక్రమ్, నంది శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు సంబంధించి అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్థులు పలు పుస్తకాలను రెఫర్ చేయగా, అవసరం అనుకున్న వాటిని సెలక్ట్ చేసుకునే బాధ్యత ఎవరికి వారే తీసుకోవాలని సూచించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్ర సర్కారు పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేస్తున్న తరుణంలో యువత నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలని, ఒక్కో సబ్జెక్టుకు కొంత టైం కేటాయించుకొని షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగితే.. కచ్చితంగా కొలువు వరిస్తుందని స్పష్టం చేశారు. కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, నిత్యం పేపర్ చదువుతూ కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలని సూచించారు.
పక్కా ప్రణాళికతో సిద్ధమైతే కొలువు సాధించడం సులువు. నిరుద్యోగ యువత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్న నేపథ్యంలో అందులో ఒక పోస్టు తమదే అన్నట్లుగా ప్రిపేరవ్వాలి. గ్రూప్-1 లక్ష్యంగా పెట్టుకొని చదవడం ప్రారంభిస్తే గ్రూప్-4 ఉద్యోగాన్నయినా దక్కించుకోవచ్చు. ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారే సర్కారు కొలువులకు పోటీ పడుతున్నారు. వారు ఉద్యోగాన్ని వదులుకోకుండానే పోటీ పరీక్షలకు సంసిద్ధులు కావాలి. రోజూ ఎనిమిది గంటలు కేటాయిస్తే సరిపోతుంది. ఉదయం 4 గంటల నుంచి 8 వరకు, రాత్రి 8 గంటల నుంచి 12 వరకు చదువుకుంటే అవాంతరాలకు అవకాశం ఉండదు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్‌కు వెళ్లే ఆలోచన విరమించుకోవాలి. ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ కోసం న్యూస్ పేపర్ చదవాలి. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్‌ను నిత్యావసరంలా వాడుకోవాలి. కానీ, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా గ్రూపులకు కొంతకాలం దూరంగా ఉండాలి. నాలుగు నుంచి 10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పుడున్న పరీక్షా విధానంలో నెగెటివ్ మార్కింగ్ లేదు. ఇది ఒక గొప్ప అవకాశం. ఉత్తమ మార్కుల కోసం ‘టీఎస్‌డీపీఎస్. తెలంగాణ.గౌట్.ఇన్’ సైట్ నుంచి పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ఈఆర్టీ పుస్తకాల్లో పూర్తి శాతం సమాచారం ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు వారధి సొసైటీ ద్వారా నమూనా పరీక్షలు నిర్వహిస్తాం.
కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మేం అనుకున్నట్లుగా జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయి. కాస్త లేటైనప్పటికీ భారీ రిక్రూట్మెంట్ చేస్తున్నరు. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన అనంతరం ప్రిపరేషన్‌పై దృష్టి సారించా. గ్రూప్-2 ఉద్యోగ సాధనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇప్పటికే ఓ ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన.
– రేణికుంట దివ్య, శాతవాహన విద్యార్థి, కరీంనగర్ (కొత్తపల్లి)
నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా జోనల్ వ్యవస్థ తెచ్చారు. ఆ క్రమంలోనే నోటిఫికేషన్లలో జాప్యం జరిగింది అనుకుంటున్న. చాలా కాలం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. త్వరలో విడుదల చేసే నోటిఫికేషన్లపై విద్యార్థి, యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువత లక్ష్యమంతా ఇప్పుడు ఉద్యోగాల సాధనపైనే ఉంది.
– బదావత్ రంజిత్‌కుమార్, శాతవాహన విద్యార్థి, కొత్తగూడెం(కొత్తపల్లి)
గ్రూప్-1, 2 సాధనే నా లక్ష్యం. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్, శాతవాహన యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన అవగాహన కార్యక్రమంతో మరింత ఉత్సాహాన్ని నింపింది. గ్రూప్-1 అధికారుల సంఘం నాయకులు చాలా విలువైన సలహాలు, సూచనలు అందించారు. వీరు చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తే ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారు.
– ఇ సజత, శాతవాహన విద్యార్థి, మహబూబాబాద్(కొత్తపల్లి)
ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం యువతలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. ఇన్నివేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు అనేవి దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకుంటున్నా. ఇప్పుడు కష్టపడితే ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండవచ్చు. విజయమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. గతంలో ఉద్యోగాలు సాధించిన వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్న.
– కడారి సంధ్య, శాతవాహన విద్యార్థి, వరంగల్(కొత్తపల్లి)
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు పుస్తకాలను చదివి మెటీరియల్‌ను తయారు చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆశించిన ఉద్యోగం సొంతమవుతుంది. పోటీ పరీక్షలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించేందుకు గ్రూప్-1 అధికారుల సంఘం ముందుకురావడం అభినందనీయం. ఒకప్పటికీ ఇప్పటికి పరీక్షల ప్రిపరేషన్ పద్ధతిలో ఎన్నో మార్పులు వచ్చాయి. దానికి తగినట్లు సిద్ధమవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నిరుద్యోగులు నష్టపోవద్దేనే ఉద్దేశంతో ప్రత్యేక సిలబస్‌ను రూపొందించింది. ఇందులో 40 శాతం మార్కులు తెలంగాణ మలిదశ ఉద్యమం, పరిణామాలు, ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి ఉద్దేశాలను చూపే ప్రశ్నలు ఉంటాయి. అలాంటి విషయాలలో అభ్యర్థులు పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలి. సలహాలు, సూచనల కోసం మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. యూనివర్సిటీ స్థాయిలో కాంపిటేటివ్ సెల్‌ను ఏర్పాటు చేస్తాం.
– శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూలేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి పూనుకున్నది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగుల అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసి, వారు ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలనే గొప్ప సంకల్పంతో కరీంనగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ఆర్(రీడ్, రికార్డ్, రివిజన్) పద్ధతిలో పరీక్షలకు సిద్ధమవ్వాలి.అలాగే, మోడల్ ప్రశ్నాపత్రాలను ఎప్పటికప్పుడు చదువుతూ ప్రతి సబ్జెక్ట్‌కు ఒక నోట్స్ పెట్టుకోవాలి. అలాగే, పుస్తకం సెలక్షన్‌లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.
– మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నల సరళి కోసం పాత ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేయాలి. సబ్జెక్టుపై అవగాహన వచ్చిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నిపుణుల సలహా మేరకు నాణ్యమైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. సబ్జెక్ట్‌ను అంశాలవారీగా విభజించి చదువుకోవాలి. ప్రభుత్వ పథకాలు, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
– నూనావత్ నవీన్‌కుమార్, ఏటీవో
ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న వారికి తెలుగు అకాడమీ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ప్రామాణికమైన సమాచారం దొరుకుతుంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలను చదవాలి. ఇందుకు రోజుకూ ఒక గంట కేటాయించాలి. గందరగోళానికి గురికాకుండా పక్కా ప్లాన్‌తో సిద్ధమవ్వాలి. ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి.
– రజిత, ఏసీటీవో, కరీంనగర్
తెలంగాణ ప్రభుత్వం పెద్దమొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయడం నిరుద్యోగులకు వరం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. తన ప్రతిభా సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. మొదట సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. గుడ్డిగా కాకుండా పక్కా ప్రణాళికతో ప్రిపేరవ్వాలి. పాఠ్యాంశాలను చదువుకున్న తర్వాత షార్ట్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతిరోజూ రివిజన్‌కు కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే అనుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు.
– ప్రసన్న హరికృష్ణ, డిగ్రీ అధ్యాపకుడు, ఎస్సారార్ కళాశాల
2003కు ముందు ఎనిమిది ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన. అదే సమయంలో ప్రభుత్వ కొలువుల సాధనకు సిద్ధమైన. ఉద్యోగాలు చేయడంతోనే ఆత్మవిశ్వాసం సమకూరింది. 2003 గ్రూప్- 1 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతిరోజూ పక్కా ప్రణాళికతో చదివిన. సబ్జెక్టును చిన్న చిన్న భాగాలుగా చేసుకొని అధ్యయనం చేసిన. నెగెటివ్ అంశాల జోలికి వెళ్లకుండా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లి ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని సాధించిన.
– శరత్చంద్ర, డిప్యూటీ డైరెక్టర్, జీహెచ్ఎంసీ
సాధించాలనే తపన ఉన్నప్పుడే ఉద్యోగం దక్కుతుంది. నేను కరీంనగర్‌లోనే పుట్టి పెరిగిన. ఇక్కడి సర్వసతీ శిశుమందిర్‌లో పదో తరగతి, సైన్స్ వింగ్ కళాశాలలో ఇంటర్, ఎస్సారార్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన. అది కూడా పూర్తిగా తెలుగు మీడియంలోనే. ఆ తర్వాత గ్రూప్-2లో ఉద్యోగం సాధించి డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌గా పని చేసి, 2007లో గ్రూప్-1లో ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయిలో ఉన్న. ప్రతి ఒక్కరూ ఇదే తరహాలో సాధించాలన్న తపన ఉన్నప్పుడే ఉద్యోగం సొంతమవుతుంది.
– రావుల శశిధర్, జాయింట్ కమిషనర్
అభ్యర్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఇతరులను గుడ్డిగా అనుసరించవద్దు. తనకు నచ్చిన పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటికి మించి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నప్పుడు కామన్ సిలబస్‌ను గుర్తించి ప్రత్యేకంగా ప్రిపేరవ్వాలి. అలాగే ప్రతిరోజూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోని అంశాలను తరచూ రివిజన్ చేయాలి. అప్పుడే ఆశించిన ఫలితం ఉంటుంది.
– రంజిత, డిప్యూటీ డైరెక్టర్,కరీంనగర్ మున్సిపల్