అమరావతి : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరిగి తాము అధికారంలోకి రాకపోవడం సీమ ప్రజల దురదృష్టమని అన్నారు. రాయలసీమ ( Rayalaseema ) లిఫ్ట్‌ను ఆపించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని తెలిపారు.
చంద్రబాబు రేవంత్‌తో చేసుకున్న లోపాయికారి ఒప్పందం కారణంగానే రాయలసీమకు మరోసారి అన్యాయం జరుగుతుందని, రాయలసీమకు చంద్రగ్రహణం ( Chandra Grahanam )పట్టిందని విమర్శించారు. చంద్రబాబు స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌పై వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడడం సీమకు ద్రోహం చేసినట్టేనని దుయ్యబట్టారు . వైసీపీ హయాంలో శ్రీశైలం నీటిని 500 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంకు ఇచ్చామని వెల్లడించారు. సీమ ప్రాజెక్టులకు పూర్తిగగా నీళ్లు నింపుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కెనాళ్ల సామర్ధ్యాన్ని పెంచి గండికోటలో నీళ్లు నిలువ చేశామని వివరించారు.
పులిచింతలలో 45 టీఎంసీలు, బ్రహ్మంసాగర్‌లో 17 టీఎంసీలు , సోమశిలలో 78, కండలేరలో 68 టీఎంసీల నీటిని నిల్వ చేశామని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత తమదేనని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.