న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీని ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. రెండు విడతలుగా నిర్వహించే ఈ టోర్నీలో మొదట లీగ్ మ్యాచ్లు.. అనంతరం జూన్లో నాకౌట్ మ్యాచ్లు జరుపనున్నట్లు స్పష్టంచేశాడు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకుంది. ‘రెండు దశల్లో రంజీ ట్రోఫీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి దశలో లీగ్ స్టేజీలో అన్ని మ్యాచ్లు నిర్వహిస్తాం. నాకౌట్లు జూన్లో జరుపుతాం. దేశీయ టోర్నీల్లో రంజీ ట్రోఫీ ప్రతిష్ఠాత్మకమైనది. ప్రతి యేటా భారత క్రికెట్కు అద్భుతమైన ఆటగాళ్లను అందిస్తున్నది. ఈ టోర్నీని అత్యంత సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’ అని జై షా తెలిపాడు. ఈ టోర్నీ ప్రారంభంపై బోర్డు చేసిన ప్రకటనపై రంజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తంచేశాడు. మార్చి 27 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రంజీ ట్రోఫీని ఒకే దశలో నిర్వహించడం కష్టమవడంతో ఈ ట్రోఫీని రెండు దశలుగా నిర్వహించేందుకు బోర్డు నిర్ణయించింది. అంతకుముందు ఈ ట్రోఫీ విషయమై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్విటర్లో స్పందించాడు. ‘భారత క్రికెట్కు రంజీ ట్రోఫీ వెన్నెముకలాంటిది. దాన్ని విస్మరించడం ప్రారంభిస్తే మన క్రికెట్ వెన్నెముక లేనిది అవుతుంది’ అని ట్వీట్ చేశాడు.