‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రానికి గాను ఉత్తమనటిగా రాణీ ముఖర్జీ జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ పురస్కార ప్రదాన వేడుకలో రాణీ ముఖర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దానికి కారణం ఆమె మెడ లో ఉన్న గొలుసు. ఆ గొలుసుపై తన కుమార్తె ‘అదిరా’ పేరు చెక్కబడి ఉంది. ప్రస్తుతం ఈ గొలుసుతో ఉన్న రాణీ ముఖర్జీ ఫొటోలు వైరల్గా మారాయి. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ ‘నా కూతురు అదిరా చూస్తుండగా అవార్డు అందుకోవాలని ఆశించా.
కానీ 14ఏండ్ల లోపు పిల్లలకు అనుమతి లేదు. దాంతో తను రాలేకపోయింది. నాకెంతో ప్రత్యేకమైన రోజున నా కూతురు నాతో లేకపోవడం బాధేసింది. అందుకే తన పేరును ఓ గొలుసుపై చెక్కించా. దాన్ని ధరించి అవార్డు అందుకున్నా. ఈ విషయంపై చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేశారు. ‘రాణీ తన కుమార్తెను వెంట తీసుకెళ్లింది’ అంటూ నా గొలుసును హైలైట్ చేస్తూ వార్తలు రాశారు. ‘వాటిని నా కూతురికి చూపించా. తను చాలా ఆనందపడింది’ అంటూ చెప్పుకొచ్చారు రాణీ ముఖర్జీ.