దక్షిణాదిన వరుస సినిమాలతో దూసుకుపోతున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. స్టార్ హీరోల సరసన చాన్స్‌లు కొట్టేస్తూనే లేడీ ఓరియెంటెడ్ పాత్రలతోనూ సత్తా చాటుతున్నది. ఇటీవలే ‘పరదా’ సినిమాతో ఆకట్టుకుంది. ఎన్ని భాషల్లో పనిచేసినా తనకెప్పుడూ తెలుగు ప్రేక్షకులు చాలా స్పెషల్ అంటూ అనుపమ పంచుకున్న ముచ్చట్లు ఇవి..
మాది కేరళలోని త్రిస్సూరు. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే కాబట్టి ఇంట్లో చాలా క్రమశిక్షణతో పెరిగాం. స్కూల్‌డేస్‌లోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. నాటకాల్లో చిన్నచిన్న పాత్రలు వేసేదాన్ని. అప్పటినుంచే నటనపై మక్కువ ఏర్పడింది.
‘శతమానం భవతి’ తెలుగులో హీరోయిన్గా నా తొలి సినిమా. నిత్య పాత్ర నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. తెలుగునాట మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది. ‘అ ఆ’ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినా.. త్రివిక్రమ్‌తో పనిచేయాలని ఒప్పుకొన్నా! ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు నన్ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.
ప్రతి పరిశ్రమకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మలయాళ సినిమాల్లో కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
తెలుగు సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలు ఉంటాయి. తమిళ సినిమాల్లో ఎనర్జీ, డైనమిజం ఎక్కువ. మూడు భాషల్లో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా.
భిన్నమైన పాత్రలు పోషించడానికే ఇష్టపడతాను. టిల్లు స్క్వేర్’లో నా పాత్ర చాలా బోల్డ్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. సమాజంలో స్త్రీపై వివక్ష గురించి మాట్లాడే సినిమాలు చేయడం నాకు ఇష్టం. ‘పరదా’ సినిమా
చాలా ఇష్టంగా చేశాను! ఇందులోని సుబ్బు పాత్ర చాలా బలమైనది, సమాజంలోని దురాచారాలను ప్రశ్నిస్తుంది.
నాకు సినిమాలంటే చిన్నప్పటి నుండి ఆసక్తి. కొట్టాయంలోని సీఎమ్మెఎస్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ చదువుతూనే.. ‘మణియరళియే అశోకన్’సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అక్కడ నా పనిని చూసి ‘ప్రేమమ్’ సినిమాలో మేరీ జార్జ్ పాత్ర కోసం ఎంపిక చేశారు. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ‘ప్రేమమ్’ (2015) నా తొలి చిత్రం. నేను స్క్రీన్‌పై కనిపించిన సమయం తక్కువైనా, మేరీ జార్జ్ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ సినిమా విజయం నన్ను ఒక్కసారిగా స్టార్‌గా మార్చింది. మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస అవకాశాలు వచ్చాయి.