రంగారెడ్డి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని.. కొంతమంది భూస్వాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా మార్చిన అలైన్‌మెంట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు చెందిన పలువురు రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి రైతు సంఘం నాయకులు, రైతులు ప్రయత్నించారు.
కాని, కొంతమందిని మాత్రమే లోపలికి పంపిస్తామని, పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అప్పటికే కలెక్టర్ ఆందోళనకారుల పక్కనుంచే వెళ్లిపోవడంతో ఆందోళనకారులు కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న రైతు సంఘం నాయకులు, రైతులను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు ఆందోళనకారుల వద్దకే డీఆర్వో వచ్చి వినతిపత్రం తీసుకున్నారు.
అలైన్మెంట్ మార్పుతో జిల్లా పరిధిలోని మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండలాల్లో వేలాదిమంది సన్న, చిన్నకారు రైతులు తమ భూములను కోల్పోతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య తెలిపారు. వెంటనే ప్రభుత్వం గతంలో ఉన్న అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని, మార్చిన అలైన్‌మెంట్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నర్సింహులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పలువురు భూ నిర్వాసిత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వికారాబాద్ : ట్రిపులార్‌కు పేదల భూములు తీసుకోవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శనివారం ట్రిపులార్‌కు పేదల భూములు తీసుకోవద్దని జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌కు సీపీఎం ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 4 మండలాలు, 23 గ్రామాల్లో వెయ్యికి పైగా ఎకరాల్లో పేద రైతులు పంటలను సాగు చేస్తున్నారని తెలిపారు. సాగు భూములను (80 శాతం) ప్రాజెక్టుల పేరుతో తీసుకోవద్దన్నారు. 70 శాతం వ్యవసాయనికి యోగ్యం కానీ భూములు తీసుకోవాలన్నారు.