బంట్వారం, మార్చి 9 : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలో ఆయన ఉంటే.. ప్రతిపక్షాలు లేనిపోని అవాంతరాలు సృష్టిస్తూ అడ్డంకులు చెపుతున్నారన్నారు. ఇది ప్రతిపక్షాలకు తగింది కాదన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్‌గౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఖాజాపాషా, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్, నాయకుడు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
నిరుద్యోగులకు తీపి కబురు
వికారాబాద్, మార్చి 9 : నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారని కౌన్సిలర్ గాయత్రి తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని 31వ వార్డు శివరాంనగర్ కాలనీలో నిరుద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి, సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగాల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారన్నారు. నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమణ, నిరుద్యోగులు, వార్డు యువత పాల్గొన్నారు.
మిన్నంటిన సంబురాలు
కొడంగల్, మార్చి 9 : పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు నిరుద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియామకాల్లో భాగంగా నేడు అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలపై స్పష్టత కల్పించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించినట్లు తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురును అందించి వారి కోరికలను నెరవేర్చడంపై ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌బాబు, కోఆప్షన్ సభ్యుడు ముక్తార్, సర్పంచ్ శంకర్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు నవాజొద్దీన్, ఫహీమ్, అన్నుబాయి పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు తీపి కబురు
కోట్‌పల్లి, మార్చి 9 : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగావకాశాలను కల్పించబోతున్నామని శాసనసభలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగ యువతలో సంతోషాలు వెల్లివిరిసాయని టీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పాండు పంతంగే మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నిరుద్యోగతను తొలగించేందుకు ఉద్యోగావకాశాలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ దీప ఆధ్వర్యంలో..
తాండూరు రూరల్, మార్చి 9 : మున్సిపల్ వైస్ చైర్మన్ దీప ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని ఇందిరాచౌక్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, రాజన్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ ఉన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
పెద్దేముల్, మార్చి 9 : రాష్ట్ర సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ఉద్యోగాల కోసం ప్రకటన చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఆశగా ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన చేసి తీపి కబురును అందించారన్నారు. ఉద్యోగాల్లో సీఎం కేసీఆర్ వయోపరిమితిని సడలిస్తూ ఎస్సీ, ఎస్టీలకు 49 సంవత్సరాలు, మిగతావారికి 44 సంవత్సరాలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రంగయ్య, రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్, యువజన అధ్యక్షుడు సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి రఘు, గ్రామ కమిటీ అధ్యక్షుడు డీవై ప్రసాద్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి వెంకట్, సీనియర్ నాయకులు మెరాజ్, యువ నాయకులు నర్సింహ(గేల్), గోపాల్, రమేశ్ ఉన్నారు.
బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి
మర్పల్లి, మార్చి 9 : మండలంలోని కోట్మర్పల్లిలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రైతు బంధు మాజీ గ్రామ అధ్యక్షుడు రాచయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంజిరెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, రాచయ్య, ప్రభు పాల్గొన్నారు.
95 శాతం స్థానికులకే ఉద్యోగాలు..
పరిగి, మార్చి 9 : పరిగిలో నిరుద్యోగులు, టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యోగాల జాతర ప్రకటించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. 95శాతం జిల్లావాసులకే ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ అశోక్, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వయో పరిమితి పెంపుతో ప్రయోజనం
– నరేందర్‌గౌడ్, గాజీపూర్, యాలాల మండలం
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఉద్యోగ నోటిఫికేషన్ వెలుపడడం సంతోషంగా ఉంది. స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించడంతో గ్రామీణ నిరుద్యోగులకు మేలు చేకూరుతుంది. వయోపరిమితి పెంపుతో చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. ఒకే అభ్యర్థి అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాయడానికి అవకాశం లభించింది.
నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు
ఉమాదేవి. ఖుదావంద్‌పూర్, పరిగి మండలం
ముఖ్యమంత్రి కేసిఆర్ 91,142 ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం ఎంతో సంతోషించదగ్గ విషయం. నోటిఫికేషన్ల ప్రకటనతో యావత్ నిరుద్యోగ తెలంగాణ కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది. త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేపడితే యువత ఆశలు నెరవేరుతాయి. వయోపరిమితిని కూడా పెంచి అందరి మనస్సును సీఎం కేసీఆర్ గెలుచుకున్నారు.
సువర్ణ దినం : రాధిక, నిరుద్యోగి, బషీరాబాద్
నోటిఫికేషన్ల ప్రకటనతో మార్చి 9ని సువర్ణ దినంగా చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ అసెబ్లీలో 91 వేల ఉద్యోగాల నియామకం ప్రకటనతో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం నిజమైంది. ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనతో పాటు, తక్షణ భర్తీ అని చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా చారిత్రాత్మకమవుతుంది.
నిరుద్యోగుల ఆశలకు రెక్కలు : నర్సింహ
యాదవ్, టీఆర్ఎస్వీ పరిగి మండల శాఖ అధ్యక్షుడు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు శాఖలవారీగా ఖాళీల వివరాలను ప్రకటించి నిరుద్యోగుల ఆశలకు రెక్కలు తొడిగారు. ఒకే విడుతలో 91,142 ఖాళీలను ప్రకటించి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీం అధికారులను ఆదేశించడంపై నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రుల కల నెరవేరుస్తా
– పబ్బె వసంత్‌కుమార్, మర్పల్లి
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఆనందం కలిగింది. నాలాంటి నిరుద్యోగులకు మంచి అవకాశం. ఈసారి కష్టపడి ఉద్యోగం సాధించి నా తల్లిదండ్రుల కల నెరవేరుస్తా.
యువతకు సువర్ణ అవకాశం : నరేందర్, తాండూరు
నేను ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎమ్ఎల్టీ చేశాను. ఇంత భారీస్థాయిలో ఉద్యోగ నోటిపికేషన్ రావడం సంతోషంగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 91వేల ఉద్యోగాల నియామక ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఈ మూడింటిని సాధించింది. తెలంగాణ యువత తరపున సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది యువతకు సువర్ణ అవకాశం.
మంచి అవకాశం : ప్రకాశ్, యెల్లకొండ
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో ఉద్యోగాలకు ప్రకటన జారీచేసిన సందర్భాలు లేవు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 11,103 మందిని రెగ్యులరైజ్ చేస్తామనడం సంతోషకరం. ఉద్యోగాల ఖాళీలను శాఖలవారీగా సేకరింపజేసి వయస్సు ఎక్కువైందన్న ఆలోచనతో వయోపరిమితిని కూడా పెంచి అందరి మనస్సును సీఎం కేసీఆర్ గెలుచుకున్నారు. ఇది ఉద్యోగాల జాతరగా పేర్కొనవచ్చు.
మార్చి 9ని మరిచిపోం : ఎం.సురేశ్, పట్లూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ 91వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన చేయడం.. వాటిని తక్షణమే భర్తీ చేస్తామనడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉందో.. ఈ రోజు కూడా అంతే సంతోషంగా ఉంది. డిసెంబర్ 9 తెలంగాణ సాధన దినంగా లాగే మార్చి 9 కూడా చరిత్రలో నిలిచిపోతుంది.
నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త
– బొంగలి రమేశ్, కోకట్ గ్రామం, యాలాల మండలం
సీఎం కేసీఆర్ మాట అంటే మాటే. నిరుద్యోగులకు నేడు పండుగ రోజు. 90 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిపికేషన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇన్నేండ్లు అర్ధాకలితో ఉన్న మాకు ఈ నోటిఫికేషన్‌తో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఎడారిలో ఒయాసిస్‌లా అనుభూతి : మానస, హస్నాబాద్, కొడంగల్
ఉపాధ్యాయ కోర్సు పూర్తి చేసి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఎప్పుడెప్పుడా అనుకున్న ఉద్యోగ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్ ఓ స్పష్టత ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ ఎడారిలో ఒయాసిస్‌గా అనుభూతిని పొందుతున్నాం. వయోపరిమితిని కూడా పెంచి అందరి మనస్సును సీఎం కేసీఆర్ గెలుచుకున్నారు. ఇది ఉద్యోగాల జాతరగా పేర్కొనవచ్చు.
యువత హర్షించదగిన రోజు : జి. లక్ష్మణ్, బషీరాబాద్
బషీరాబాద్, మార్చి 9 : రాష్ట్ర నిరుద్యోగ యువత మొత్తం హర్షించదగిన రోజు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వివిధ ఖాళీలు ప్రకటించడం, రాష్ట్ర నిరుద్యోగ యువతకు గొప్ప వరం. రాష్ట్రం మొత్తం గర్వించదగిన విషయం. నోటిఫికేషన్ల ప్రకటనతో యావత్ నిరుద్యోగ తెలంగాణ కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది.