Water | మాడ్గుల : మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంగా అరకొర నీళ్లు మాత్రమే రావడంతో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు.
తమ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు ఐదు రోజులకు ఒకసారి మాత్రమే వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే కేసీఆర్ పాలనలో నీటి కొరతే ఉండేది కాదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తమ గ్రామాన్ని సందర్శించి, నీటి ఎద్దడి తీర్చాలని కోరుతున్నారు.
మా తండాలో మిషన్ భగీరథ మంచీ నీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఐదు రోజులకు ఒకసారి మాత్రమే వస్తున్నాయి. అవి కూడా కొంచెం మాత్రమే వచ్చి బంద్ అవుతున్నాయి. తాగడానికి నీరు లేక బోర్ల వద్ద నీటిని తెచ్చుకుంటున్నాం. మా తండా వాసులను ప్రభుత్వం పట్టించుకొని నీరు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నా.
– కొర్ర బుచ్చమ్మ, కొర్ర తండా గ్రామం, మాడ్గుల మండలం,
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పందించి మా తండాకు మిషన్ భగీరథ మంచి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకొని నీరు వచ్చేటట్లు చేయాలి. నీళ్లు లేకపోతే మేం ఎట్ల బతకాలి సారూ..
కొర్ర బుజ్జి, కొర్ర తండా గ్రామం, మాడ్గుల మండలం,
మా తండాలో మిషన్ భగీరథ మంచీ నీరు రాక ఇబ్బందులు ప్రజలు పడుతుంటే మిషన్ భగీరథ అధికారికి, ఏఈకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. ఎంపీడీవో పద్మావతికి వినతిపత్రం అందజేశాం. ఆమె వచ్చి తండాను సందర్శించారు. కానీ సమస్య పరిష్కరం కాలేదు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చొరవ చూపి తండాకు మిషన్ భగీరథ మంచీ నీరు వచ్చేటట్లు చేయాలి. మిషన్ భగీరథ అధికారి, ఏఈని సస్పెండ్ చేయాలి
– కొర్ర బాలు నాయక్