– మత్తుతో చిత్తవుతున్న యువత
– చర్యలు తీసుకోవాలంటున్న బస్తీ వాసులు
చుంచుపల్లి, జూలై 20 : చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్ ట్యాంక్ సమీపంలో కొందరు వ్యక్తులు గుడుంబా విక్రయాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుడుంబాకు బానిసలవుతున్న పలువురు యువకులు, కూలీలు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఆస్పత్రుల పాలవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంతో గుడుంబా విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రశాంతి నగర్‌కు చెందిన భువన్ అనే వ్యక్తి మద్యం వ్యసనంతో తీవ్ర అస్వస్థతకు గురై మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనే విషయం ప్రశాంతి నగర్ యూత్ వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆ ఘటనకు గుడుంబాతో ప్రత్యక్ష సంబంధం ఉందా లేదా అనే విషయంపై అధికారిక నిర్ధారణ లేదు.
స్థానికుల తెలిపిన ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గుడుంబా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడంతో అక్రమ మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయని చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపులు, గుడుంబా విక్రయాలు మళ్లీ పెరిగాయని, గల్లీ గల్లీలో అక్రమ మద్యం అందుబాటులోకి రావడంతో యువత మత్తుకు బానిసవుతూ ఆరోగ్యాలను కోల్పోతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతి నగర్‌తో పాటు మండలంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీసు శాఖ, ఆబ్కారీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే గుడుంబా వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.