నానమ్మ అంత్యక్రియలు మా ఊళ్లోనే చేశారు. చిన్నాన్న ఇల్లు దాటి వెళ్లొద్దు కనుక.. ఏవైనా పనులుంటే వాళ్ల కూతురు, మా కజిన్ సరస్వతక్కకి చెప్పేవాళ్లు. అలా.. ఒకరోజు కూనూరుకు వెళ్లి ఏవో వస్తువులు తెమ్మని పంపించారు. మమ్మల్ని రమ్మని పిలిస్తే మేమూ వెంట వెళ్లాం.
మా సరస్వతక్క ఆరిందలా ఉండేది. తను అక్క కంటే రెండేళ్లు పెద్దది. అప్పటికి పదహారు – పదిహేడు ఏళ్లు ఉంటాయేమో.. అంతే! సినిమాల్లో సావిత్రిలా కళ్లు తిప్పుతూ, అప్పుడప్పుడూ కళ్లు వాల్చి మాట్లాడుతుండేది. కూనూరు వెళ్లి బండి దిగగానే ఇంటి ముందర బంకుల్లోనే (వరండాను బంకులు అనేవారు) కింద కూలబడి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది సరస్వతక్క. “ఓ ఉంకోమ్మా! మా ఉంకోమ్మా! నువ్వు ఎక్కడికి పోయినవు ఉంకోమ్మా! నువ్వులేని ఇంటికి ఒచ్చినము ఉంకోమ్మా! నీ ఇంటికి ఒచ్చినము ఉంకోమ్మా! నువ్వు అడివిల ఇల్లు కట్టుకోవటానికి పోయినవా ఉంకోమ్మా!..” ఇలా ఓ అయిదు నిమిషాలు రకరకాలుగా వర్ణిస్తూ ఏడ్చింది. అంతేకాదు, మమ్మల్ని కూడా ఏడవమని సైగ చేసింది. మాకేమో ఆ రంగంలో అంతగా నైపుణ్యం లేదు. అసలు ఆ రకంగా ఏడవాలని కూడా తెలియదు. పైగా తను ఇప్పటిదాకా నవ్వుతూ ఉండి.. ఒక్కసారిగా అలా ఏడుస్తుంటే నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఈలోగా ఇంటిముందు చాలామంది గుమిగూడారు. అందులో ఒకాయన..
“ఏడ్వకమ్మాయి ఏడ్వకు! పాపం! ఏమయింది? ఎట్ల పోయింది దొర్సాని?! వారం కింద బాగుండె గద!” అని పరామర్శించాడు. ఇంకొకాయన.. అందర్నీ తోసుకుంటూ వచ్చి.. “పెద్దమ్మగారు మన మధ్య ఉండీఉండీ ఒక్కసారే డుబుక్కుమన్నరు” అన్నాడు. అతడు అన్న విధానానికి నేను ముఖం పక్కకు పెట్టి నవ్వకుండా ఉండలేకపోయాను. ఆ పక్కనే ఉన్న ఇంకొకామె.. “ఎట్ల అయితె గట్నే ఆయె గని, నువ్వుసుత పెద్దోండ్ల లెక్క శోకం బెట్టి మంచిగ ఏడుస్తానవ్! మీ నాయనమ్మ ఆత్మకు తుర్తి అయితది తియ్యి!” అంటూ.. “గీ వీళ్లెవలు?!” అనడిగింది. “మా పెదనాయన బిడ్డలు, మా చెల్లెండ్లు!” అన్నది సరస్వతక్క ముక్కు చీదుకుంటూ.
“గీడ ఎప్పుడు కనబడ్లే !” అన్నదామె. “అవును! ఇక్కడ ఉండరు. ఘన్పూర్లో ఉంటరు” అన్నది సరస్వతక్క. ఆమె మమ్మల్ని కిందా మీదా చూసింది. మా నానమ్మ ఆత్మకు శాంతి లభించేలా బాగా శోకంపెట్టి ఏడ్చి ఆ వచ్చినామెకు విశ్వాసం కలిగించలేక పోయినందుకు నేను బాగా చింతించాను. మొత్తానికి మరి కొంతమంది వచ్చి పరామర్శించి, వాళ్లకోసం కూడా ఏడ్చేదాకా మా సరస్వతక్క ఇంట్లోకి రాలేదు. ఆ తర్వాతనే తీసుకెళ్లడానికి ఏవో సామాన్లు సర్దింది.
“ఏడ్వకుంటే వీళ్లకు దుఃఖం లేదనుకుంటరు. మీకు ఎంత సైగజేసినా ఏడ్వరేందే?!” అని కొంచెం కినుకగా మమ్మల్ని అడిగింది. “మాకు నీ తీరుగ ఏడవరాదక్కా! అసలు ఏడ్చుడే ఒస్తలేదు” అన్నాం మేం. మా జవాబు తనకు సంతృప్తిని ఇచ్చిందో లేదో కానీ, సరస్వతక్క ఏమీ అనలేదు. మళ్లీ మా ఇంటికి వచ్చాక మాత్రం తన రేంజ్ పెరిగిపోయింది. బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
“అక్కడ అందరు ఒచ్చినారే?! మందలిచ్చిన్రా?!” అని చిన్నమ్మలూ, అత్తలూ అడిగినప్పుడు ఎవరెవరు ఏమన్నారో పూసగుచ్చినట్టు చెప్పింది సరస్వతక్క. తనెలా ఏడ్చిందీ, ఏమేం గుర్తు చేసుకున్నదీ వివరంగా చెబుతుంటే.. “ఎంతైనా ఆడిపిల్లల ప్రేమలే వేరు! అయినా ఇది బాగ వివరం గల పిల్ల” అని వాళ్లు మెచ్చుకుంటుంటే.. తన శ్రమకు తగిన ఫలితం దక్కిందని సరస్వతక్క సంతోషించింది. మేమూ ఆనందించాం.. మనకెటూ ఏడ్వడం రాదు కదా !
ఆ పన్నెండు రోజులూ మా అమ్మ పనితోనూ, వచ్చి పోయేవాళ్లను చూసుకోవడంలోనూ సతమతమై పోయింది. ఎప్పుడో ఓ పది నిమిషాలు తప్ప కనిపించేదే కాదు. ఇక నాన్న సామాన్లు తెప్పించడం, వంటవాళ్లను, అయ్యగార్లను మాట్లాడటం, రోజొక వీధి భాగోతమో, బుర్రకథో, హరికథో పెట్టించడం, వచ్చినవాళ్లకు అతిథి మర్యాదలు చేయడంలో మునిగిపోయి ఉండేవాడు.
ఆ రోజుల్లో ఎన్నోరకాల మనుషులనూ, వాళ్ల ఏడుపులనూ, పిచ్చి ప్రశ్నలనూ, పరామర్శలనూ చూశాను నేను. ఎవర్ని ప్రశ్నలు అడుగుదామన్నా కుదిరేది కాదు. లచ్చక్క భర్త సత్యనారాయణ రావు బావ మాత్రం సరస్వతక్కను ఆటపట్టిస్తూ మమ్మల్ని నవ్విస్తూ ఉండేవాడు. “మీరిద్దరు అక్కాచెల్లెళ్లు, వీళ్లిద్దరు అక్కాచెల్లెళ్లు చెవులకు ఒకేరకం గున్నాలో, జూకాలో పెట్టుకుని మరీ ఏడవండి. ఒకే తీరువి లేకపోతే చెరో చెవికి పెట్టుకుని.. ఇంకో చెవి చేత్తో మూసుకుని ఏడవడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడిక ఒచ్చినోళ్లకు మీరు చెప్పనవసరం లేకుండా ఒకే తీరు గున్నాలున్నయి గనుక అక్క చెల్లెళ్లని తెలిసిపోతది. కొన్ని ప్రశ్నలన్న తప్పిచ్చుకోవచ్చు. అట్లనే ఒక్కతీరు లంగా జాకెట్లు ఉన్నవాళ్లు అట్లనే ఏసుకోండి.
దానివల్ల కూడా అక్క చెల్లెళ్లని తెలుస్తది” అనేవాడు. అంతే కాదు, మా శరత్ అన్న, జగన్ అన్న, బావలు కలిసి.. ఈ పన్నెండు రోజుల్లో ఎవరు బాగా ఏడ్చారు, ఎవరు సహజంగా ఏడ్చారు, ఎవరు ఎక్కువసార్లు ఏడ్చారు.. అని పరిశీలించి దుఃఖ ప్రవీణ, ఏడుపు రాణి, శోక వీణ.. ఇలా బిరుదులు ఖరారు చేశారు. ఉంకోమ్మ దినవారాలు అయిపోయాక తీరిగ్గా బడికి వెళ్లిన నన్ను చూసి మా వరదా రెడ్డి సారు.. “రమా! నీ పేరు తీసేసినం. ఇంక బడికి రానవసరం లేదు” అనీ.. “ఏమైంది?! చదువు అడుక్కు అయింది. గారెలు, బూరెలు పైకి అయినయి” అనీ ఓ వారం రోజులు సతాయించాడు. నా మీద అభిమానంతోనే సుమా! మరో వారంలోగానే నేను మిస్సయిన నోట్స్ అన్నీ రాసుకుని, పాఠాలు నేర్చుకుని మళ్లీ ఫామ్లోకి వచ్చానన్నది వేరే సంగతి.