యాదాద్రి భువనగిరి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్ల పాలనలో రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో భీకర విధ్వంసం సృష్టించారని, అభివృద్ధి, సంక్షేమంలో 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే హైడ్రా, మూసీ కూల్చివేతల పేరుతో గందరగోళ పాలనకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. శుక్రవారం భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశఃలో ఆయన మాట్లాడారు. టీఎస్ ఐపాస్‌ను బైపాస్ చేసి, బ్రదర్స్ పాస్‌గా మార్చారని, వారు ఓకే అంటే పరిశ్రమలకు అనుమతులు వస్తున్నాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి బ్రదర్స్ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ దందాలకు తెరలేపారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఐటీలో మేటి చేస్తే, కాంగ్రెస్ వచ్చాక లూటీ చేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఖ్యాతిని రేవంత్‌రెడ్డి తన పాలన, తన బూతు మాటలతో దిగజార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో జెన్‌జీ ఉద్యమం వస్తుందని, అందులో కాంగ్రెస్ సర్కారు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు.
రేవంత్‌రెడ్డి పాలనలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని, కాంగ్రెస్ సర్కారు తీరుతో పెద్ద పెద్ద కంపెనీలు తరలిపోతున్నాయని, అందులో భాగంగా గూగుల్ ఏపీకి తరలించారని రాకేశ్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేస్తలేరని ప్రశ్నించారు. ఎన్నికల్లో గ్రామాల్లో అర్రాస్ పాట మాదిరి హామీల పాట పాడి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఉద్యోగాల హామీపై నిత్యం అశోక్‌నగర్ అట్టుడుకుతున్నదని, దిల్సుఖ్నగర్ దద్దరిల్లుతున్నదని అన్నారు. ఉమ్మడి నల్లగొండలో ఆరున్నర ఫీట్ల మంత్రులు ఉన్నారని, ఒక్కరు కూడా నిరుద్యోగుల గురించి నోరెత్తడంలేదని మండిపడ్డారు. రాజీవ్ యువ వికాసం కింద 16 లక్షల దరఖాస్తులు స్వీకరించారని, ఏడాదిన్నర దాటినా ఒక్కరికైనా రుణాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైజింగ్ అని గప్పాలు కొడుతున్నారని, కేవలం కాంగ్రెస్ నేతల ఆస్తులు మాత్రమే రైజింగ్ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఫ్యూచర్ కోసమే ఫ్యూచర్ సిటీ తెచ్చారన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, నాడు కేసీఆర్ యువశక్తిని గుర్తించి తెలంగాణను పెట్టుబడుల స్వర్గధామంగా మలిచి ఉద్యోగ అవకాశాలు కల్పించారని రాకేశ్‌రెడ్డి గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి పరిశ్రమల అనుకూల నిర్ణయాలు తీసుకున్నారని, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చారని, హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారని, శాంతి భద్రతలు అదుపులో పెట్టారని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచి కంపెనీలను తీసుకొచ్చారన్నారు. వీటి ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా మారిందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు 9.46 లక్షలకు చేరాయని, కేసీఆర్ హయాంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్టను రూ.1,200 కోట్లతో పునర్నిర్మించారని, బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను తీసుకొచ్చారని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కొలుపుల అమరేందర్, ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, చింతల కిష్టయ్య, రమేశ్, సుధాకర్, గోపాల్, వెంకట్ రెడడి, మమతరెడ్డి, కౌన్సిలర్లు నాగోటినాగు, రాజు
పాల్గొన్నారు.