ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే రేవంత్‌రెడ్డి హంగామాగా నిర్వహించిన ప్రజా దర్బార్ కొంతకాలానికే దారి తప్పింది. ప్రతి మంగళవారం, శుక్రవారం స్వయంగాఈ దర్బార్‌ను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఉదయం 10 గంటల్లోపుప్రజాభవన్కు వచ్చిన వారి అర్జీలు మాత్రమే తీసుకుంటామని కండిషన్ పెట్టారు. 10 గంటలలోపు క్యూలో నిల్చునేందుకు జిల్లాల నుంచి ప్రజలు ముందు బయలుదేరి రావలసి వచ్చేది. అయినా ఇప్పుడు ప్రజావాణి మొక్కుబడిగా మారింది.
తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజావాణి తూతూమంత్రంగా మారిపోయింది. ఒకట్రెండుసార్లు వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు కనబడుటలేదు. అప్పుడప్పుడు వచ్చిన మంత్రులు కూడా క్రమంగా గైర్హాజర్ అవుతున్నారు. వివిధ శాఖల నుంచి అధికారుల రాక కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహణలో ప్రజావాణిగా మారిపోయింది. దర్బార్ తొలినాళ్లలో వేల సంఖ్యలో వచ్చిన జనం, నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ఇప్పుడు నిరుపయోగమైన కార్యక్రమానికి రావడానికే ప్రజలు ఆసక్తి చూపడంలేదు. దూరభారాలతో వచ్చిన ప్రజలు వారి ఇబ్బందులను అక్కడే ఉన్న మీడియాతో చెప్పుకొంటున్నారు. ఏప్రిల్ నుంచి జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రజావాణి ప్రారంభించింది. అక్కడికి కూడా ప్రజల రాక తగ్గిపోయింది. ఈ నెల నుంచి ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోనే ప్రజావాణిని నిర్వహించాలని ఉత్తర్వు జారీ చేసింది.
ప్రజావాణి నిబంధనల ప్రకారం ప్రతి ఫిర్యాదుకూ ఒక గుర్తింపు నంబర్ ఇచ్చి సంబంధిత వ్యక్తికి అందజేయాలి. 30 రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించి సమాధానాన్ని ప్రజావాణి పోర్టల్‌లో పెట్టాలి. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో గుర్తింపు నంబర్ ఆధారంగా పిటిషనర్ ఆన్లైన్లో చూడవచ్చు. 30 రోజుల్లో పరిష్కరించని సమస్యలు పైఅధికారి దృష్టికి వెళ్తాయి. వాటిని వారు పరిష్కరించవలసి ఉంటుంది. నెలకు రెండుసార్లు ప్రభుత్వ అధికారులు ప్రజావాణి నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించాలి. 70 శాతం పిటిషన్లకు పరిష్కారం లభిస్తున్నదని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది.
ప్రజావాణి దృష్టికి వచ్చిన సమస్యల్లో ఇల్లు, పెన్షన్, ఉచిత కరెంటు, భూతగాదాలకు చెందినవే ఎక్కువ. ఏమైంది సారూ అని అడగడానికి వచ్చినవారికి సమాధానం చెప్పలేక ఏదో ధృవీకరణ పత్రం కావాలని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. అంతా ప్రజావాణియే చూసుకుంటుంది అని ఆశ పడిన ప్రజలకు నిరాశనే మిగులుతున్నది.
తమ ఇంటికి జీరో కరెంటు బిల్లు రావడం లేదని అర్జీ పెట్టుకున్న ఒకాయన నాలుగో సారి వచ్చినా ఫలితం లేదని అంటున్నారు. తమ ఇంటి పత్రాలను ఫోర్జరీ చేశారని ఏడాదిగా తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన లేదని ఓ మహిళ ఆవేదన. ఆ పత్రం కావాలి, ఈ పత్రం కావాలి అంటూ తిప్పుతున్నారని బాధితులు చెప్తున్నారు. ఏడాది తిప్పిన తర్వాత ’ఇక్కడ కాదు, ఫలానా డిపార్ట్మెంట్కు వెళ్లండి’ అని చెప్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు.
స్వయంగా మంత్రులు, పైస్థాయి వ్యక్తుల ద్వారా రికమండేషన్‌తో వచ్చిన వారి సమస్యలను మాత్రమే అధికారులు పట్టించుకుంటున్నారు. అలాంటి పెద్ద నేతల దర్శనం కూడా చాలామందికి కలుగడం అసాధ్యమే. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలి. ప్రజా దర్బార్‌కు వచ్చి పిటిషన్ ఇచ్చిన వ్యక్తి, మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి ఉంటే, ఇక ప్రజావాణి కార్యక్రమంతో పనేంటి? సమస్యలు చిటికెలో తీర్చుతామని గొప్పలు చెప్పే పెద్దలు దర్బార్‌కు ఎందుకు వెళ్లడంలేదు? మండల కేంద్రంలో ప్రజావాణి పేరుతో ప్రజలను మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పితే ప్రజాదర్బార్ ఉత్త ప్రచార ఆర్భాటమే కదా!
-బద్రి నర్సన్