Unemployment | హైదరాబాద్, నవంబర్ 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘గురివింద గింజ’ నీతిని తలపిస్తున్నది కాంగ్రెస్ నాయకుల వైఖరి. ప్రత్యేక రాష్ట్రంలో 2.32 లక్షల ప్రభుత్వ కొలువులకు అనుమతులనిచ్చిన బీఆర్ఎస్ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. తమ ఏలుబడిలోని రాజస్థాన్లో నిరుద్యోగం ఎలా తాండవిస్తున్నదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ర్టాల్లో రాజస్థాన్ రెండో స్థానంలో ఉండటం దీనికి రుజువు.
నిరుద్యోగానికి, పరీక్షా పత్రాల లీకేజీలకు, నిరుద్యోగ భృతి హామీల ఎగవేతకు రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కారు చిరునామాగా మారింది. రాష్ట్రంలో 18.4 లక్షల కంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నట్టు గత ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రభుత్వమే ఒప్పుకొన్నది. ఇందులో 14.4 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, లక్ష మందికి పైగా పీజీ, పీహెచ్డీలు చేసినవారు ఉన్నారు. 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరీక్షా పత్రాలు లీక్ కావడంవల్ల కనీసం 12 పరీక్షలను రద్దు చేశారు. గడిచిన పదేండ్లలో 26 పరీక్షా పత్రాలు లీకేజీకి గురైనట్టు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇక, నిరుద్యోగులందరికీ భృతి ఇస్తామన్న గెహ్లాట్ ప్రభుత్వం మొత్తం 18.4 లక్షల మంది నిరుద్యోగుల్లో కేవలం 1.9 లక్షల మందికే భృతిని చెల్లించింది. అది కూడా మూడు నెలలు మాత్రమే. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం.. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ర్టాల్లో హర్యానా (26.8 శాతం) తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రాజస్థాన్ (26.4 శాతం) నిలిచింది. రాజస్థాన్ శ్రామికశక్తిలో ప్రతీ నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నట్టు అర్థమవుతున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాల్ని చేపట్టని సర్కారుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్తామని హెచ్చరిస్తున్నారు.