కామారెడ్డి, ఆగస్టు 20: రాజంపేట ఎస్సై దువ్వల ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.30 వేలు తీసుకుంటూ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల కథనం ప్రకారం.. రాజంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో మరింత సహాయం చేయడానికి గాను ఎస్సై ఆంజనేయులు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఏసీబీ సూచన మేరకు బాధితుడు గురువారం కామారెడ్డిలోని ఎస్సై నివాసంలో ఆంజనేయులుకు రూ.30 వేలు అందజేస్తుండగా, అక్కడే మాటు వేసిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇటీవలి కాలంలో పోలీసు అధికారులు వరుసగా ఏసీబీకి చిక్కుతున్నారు. అయి నా వారిలో ఏమాత్రం మా ర్పు రావడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట పోలీసుస్టేషన్లో మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్సైలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి పోయారు. అయినప్పటికీ అవినీతి అధికారుల్లో మార్పు లేకుండా పోయింది. తాజాగా రాజంపేట ఎస్సై కూడా పట్టుబడ్డారు. అవినీతి అధికారులపై సరైన చర్యలు లేకపోవడంతో వారిలో భయమన్నదే లేకుండా పోయిందన్న అభిప్రాయం నెలకొన్నది.