మెదక్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేసి దొంగతనాలు చేసిన ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. మెదక్ జిల్లాలో చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గవ్వలపల్లి చౌరస్తాలో, మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మంబోజిపల్లిలో ఎస్బీఐ ఏటీఎంలను ధ్వంసం చేసిన తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలను గ్యాస్ కట్టర్తో కట్ చేసి నగదు దోపిడీ చేశారు. ఏటీఎంల వద్ద భద్రత లేకపోవడంతో దొంగలు దర్జాగా దోచుకుంటున్నారు.బ్యాంకు అధికారులు ఏటీఎంల వద్ద కనీస భద్రతా చర్యలు తీసుకోవడంలేదు. సీసీ కెమెరాలు, అలారం తప్పునిసరి ఏర్పాటు చేయాలి.
ఏటీఎంలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసినా అనుమానాస్పద వ్యక్తుల కదికలను వెంటనే బ్యాంకు అధికారులు, సంబంధిత భద్రతా సంస్థలు, పోలీసులకు సమాచారం అందేలా అలారం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నిఘా వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఏటీఎంలను ధ్వంసం చేసి భారీగా నగదు దోపిడీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతరాష్ట్ర దొంగల ముఠా పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. మెదక్ జిల్లాలో 44వ జాతీయ రహదారి ఉండడంతో దొంగలు తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏటీఎంల్లో దొంగతనం చేసేందుకు కారుల్లో నలుగురు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన వీడియాల ద్వారా పోలీసులు గుర్తించారు. నగదు తీసుకుని ఎక్కడికి పారిపోయారనే కోణంలో విచారిస్తున్నారు. దొంగల ముఠాను పట్టుకునేందుకు ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ఏటీఎంల భద్రతపై బ్యాంకు అధికారులు కీలకమైన చర్యలు తీసుకోవాలి. ఏటీఎం కేంద్రల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. భద్రత లోపలుంటే వెంటనే మరమ్మతులు చేయాలి. గతంలో ఏటీఎంల వద్ద పెక్యూరిటీ గార్డులను నియమించే వారు. ప్రస్తుతం ఎక్కడా సెక్యూరిటీ గార్డులను నియమించిన దాఖలాలు కనబడడంలేదు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు సైతం పని చేయడం లేదు. ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రివేళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలి. బీట్ కానిస్టేబుళ్ల ద్వారా తరుచూ తనిఖీలు నిర్వహించడం, అనుమానాస్పద వ్యక్తుల వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకు అధికారులు పోలీసులు సమన్వయంతో పని చేసి దొంగతనాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలి.
మెదక్ జిల్లాలోని మంబోజిపల్లి, చిన్నశంకరంపేట మండ లం గవ్వలపల్లి ఏటీఎంలను ధ్వంసం చేసి దోపిడీ చేసిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశాం. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాం. క్లూస్ టీం ఏటీఎం కేంద్రాల వద్ద ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తున్నారు. త్వరితగతిన కేసును ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏటీఎం కేంద్రాల వద్ద నిఘా వ్యవస్థను పెంచేందుకు బ్యాంకు అధికారులతో మాట్లాడుతాం.