Raja Saab | ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ ట్రైలర్ ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్టే కొద్ది సేపటి క్రితం మూవీ 3 నిమాషాల 34 సెకన్ల ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ మూవీ పక్కా హిట్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో ప్రభాస్ పాత్ర డెప్త్, సినిమా హంగులు మరింత బలంగా చూపించారు.
టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించనుందనే అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్, పీరియాడిక్ సినిమాల్లో కనిపిస్తున్న ప్రభాస్ తొలిసారి రొమాంటిక్ హారర్ జానర్లో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్లో ప్రభాస్ లుక్, యాక్షన్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. ట్రైలర్ మరింత ఎంటర్టైన్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత చిత్రాల్లో ప్రభాస్ రొమాన్స్ సీన్లు తగ్గిపోయాయని ఫ్యాన్స్ భావించడంతో, ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నట్లు దర్శకుడు మారుతి వెల్లడించారు.
మొదటి పోస్టర్ నుంచే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘ది రాజా సాబ్’ , టీజర్‌తో మరింత అంచనాలు పెంచింది. కుటుంబానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలు, హారర్ థ్రిల్లర్ టచ్, యూత్‌కి నచ్చే రొమాన్స్ అన్నీ కలగలిపిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా సినిమా రూపుదిద్దుకుంటోందని ఇండస్ట్రీ టాక్. చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని భావించినా, షూటింగ్ ఆలస్యం మరియు వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ సంక్రాంతి బరిలో జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.