Rains : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 420 కిలోమీటర్లు, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని చెప్పారు.
శుక్రవారం తెల్లవారుజామున అంటే.. అక్టోబర్ 3న గోపాల్పూర్- పారాదీప్ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమలో సైతం విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ ఈ సందర్భంగా మత్స్యకారులను హెచ్చరించారు.