Rain Alert | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, వచ్చే 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నాటికి ఇది తీవ్ర తుపానుగా మారనున్నదని పేర్కొన్నది. ఈనెల 28న కాకినాడ సమీపంలో ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడ్రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో గంటలకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది.