
సికింద్రాబాద్:దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చాలని దక్షిణ మధ్యరైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు వస్తాయని ప్రకటించింది. కొన్ని రైళ్లు ప్రయాణించే మార్గాలను కూడా మళ్లించినట్లు వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 872 రైళ్లు ఉన్నాయి. వీటిలో 673 రైళ్ల వేగాలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. మరికొన్ని రైళ్ల టర్మినల్ స్టేషన్లలో కూడా మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా చేసిన మార్పులన్నీ అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ సమయాలను తెలుసుకొని ప్రయాణించాలని ప్రజలకు సూచించింది.