హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర జనాభాలో 95 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కులగణన పేరిట రేవంత్ సర్కారు మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాహుల్‌ను అడ్డంపెట్టుకొని రేవంత్ బీసీల గొంతు కోస్తున్నారని విరుచుకుపడ్డారు. చట్ట ప్రకారం సెన్సెస్ చేసే బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయంలో రాష్ర్టాలకు అధికారంలేదని చెప్పారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. కులగణనకు సంబంధించి సర్కారు జారీ చేసిన 199 జీవోపై ఎవరైనా కోర్టుకెళ్తే కొట్టేసే ప్రమాదం ఉంటుందని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. క్యాస్ట్ సెన్సెస్‌పై హైకోర్టు ఆదేశాలు అందలేదని బీసీ కమిషన్ చైర్మన్ చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన కమిషన్ రేవంత్ చెప్పుచేతల్లో పనిచేయడం బాధాకరమని పేర్కొన్నారు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని రామచందర్‌రావు నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు అందలేదని చెప్తున్నవారు ఆ తీర్పునైనా చదువుకోవాలని హితవుపలికారు. కులగణనపై సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని, తమిళనాడు తరహాలో కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న రాష్ర్టానికి వస్తున్న రాహుల్‌గాంధీ స్పందించి బీసీలకు న్యాయం చేయాలని కోరారు.