రాహల్- రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎక్కడ తేడా వచ్చింది? ఎప్పటినుంచి దూరం పెరిగింది? అధిష్ఠానం ఆగ్రహానికి కారణమేంది? అనుమానం పొడసూపింది ఎక్కడ? అపనమ్మకమనే అగ్గి రాజేసిన అంశమేంది? కండ్లముందు కనిపిస్తున్న అగాధానికీ.. సొంతపార్టీ సీఎం పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకీ.. నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడానికీ.. బయటకు వెల్లడించలేని బలమైన కారణాలున్నాయా? అంటే కాంగ్రెస్ పరిణామాలను, అధిష్ఠానం అడుగులను నిశితంగా పరిశీలిస్తున్నవారు ఔననే అంటున్నారు.
బయటకు కనిపిస్తున్నది పొగ మాత్రమేనని, లోలోన రగులుతున్న అగ్నిపర్వతాలు ఉన్నాయని వారంటున్నారు. తెరవెనుక ఏం జరిగిందో తెలియాలంటే.. 15 నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలి. అసలు కథ అక్కడి నుంచే మొదలైంది. అసలేం జరిగింది?
న్యూఢిల్లీ, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ ఏమాత్రం నమ్మడం లేదని పార్టీ ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన ‘విశ్వసించదగ్గ వ్యక్తి’ కాదని రాహుల్ భావిస్తున్నాడని అంటున్నాయి. నిరుడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి ఆయన శల్యసారథ్యం వహించారని, బీజేపీ విజయానికి ఆయన పరోక్షంగా దోహదపడ్డారని రాహుల్ బలంగా నమ్ముతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ కళ్లుగప్పి ఏపీలోనూ ఎన్డీయే గెలుపునకు చాపకింద నీరులా రేవంత్ సహకరించారని రాహుల్ భావిస్తున్నాడని, రెండు రాష్ర్టాల్లో దీనికి సంబంధించిన తగిన ఆధారాలు కూడా ఆయన వద్దకు చేరాయని చెప్తున్నాయి. పలు కోణాల్లో పోస్టుమార్టం చేసుకున్న తర్వాతే రేవంత్‌ను రాహుల్ దూరం పెట్టారని, ‘నమ్మదగిన వ్యక్తి కాదు’ అంటూ సన్నిహితుల వద్ద అగ్రనేత పలుమార్లు వ్యాఖ్యానించారని సమాచారం. రేవంత్ కారణంగానే ఇటు తెలంగాణ, అటు ఏపీలో కలిపి కాంగ్రెస్‌కు బలమైన సంఖ్యలో ఎంపీలు తగ్గారని, అదే సమయంలో ఎన్డీయే కూటమికి పెరగడం వల్ల కేంద్రంలో అధికారానికి పార్టీ దూరమవడానికి ఒక కారణమైందని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారట. ‘బీజేపీ అభ్యర్థుల కోసం రేవంత్ కాంగ్రెస్ టికెట్లను మార్చేశారని, గెలవాల్సిన చాలాచోట్ల బలహీన నాయకులను అభ్యర్థులుగా దింపి, పరోక్షంగా బీజేపీకి సహకరించారని రాహుల్ నమ్ముతున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకులతో రాసుకు పూసుకు తిరగడం, కేంద్రప్రభుత్వ పెద్దలతో అవసరానికి మించి సాన్నిహిత్యం నెరపడం వంటివి కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి వచ్చాయి. అందుకే రేవంత్‌ను రాహుల్ బీజేపీ అనుకూలవాదిగా చూస్తున్నారు. ‘ఎన్నాళ్లున్నా ఆయన మన పార్టీ మనిషి కాడు’ అని అర్థం వచ్చేలా పదేపదే చెప్తున్నారు’ అని కాంగ్రెస్ అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలు న్న ఓ కీలక నేత వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఢిల్లీ -హైదరాబాద్ మధ్య అంతా సవ్యంగానే సాగింది. హస్తినకు వెళ్లినప్పుడల్లా హస్తం పార్టీ నేతలు రేవంత్‌కు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. కలిసి ఫొటోలు దిగేవారు. అయితే ఇదంతా ఆరునెలలే! పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఆశలు నీరుగారిపోయాయి.
బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గినా.. కూటమి లెక్కల్లో ఎన్డీయే అధికారం లోకి వచ్చింది. అంతాచేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికీ, ఎన్డీయే పక్షానికీ మధ్య తేడా 60 సీట్ల లోపే! ముందున్న అంచనాలకు, వచ్చిన ఫలితానికీ మధ్య ఎక్కడ తేడా కొట్టిందో, ఎక్కడ లెక్క తప్పామో తెలుసుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకత్వానికి.. తెలంగాణ నుంచే దిగ్బ్రాంతికర విషయాలు తెలిసివచ్చాయి. తెలంగాణలో పార్టీకి 8 సీట్లు మాత్రమే రావడం వెనుక సొంత పార్టీ నేతలు బీజేపీకి సహకరించడమే కారణమన్న కాంగ్రెస్‌కు అధిష్ఠానం ఓ అంచనాకు వచ్చిందని సమాచారం. అయితే ఆ దిశగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యత తనదేనని నమ్మబలికిన ముఖ్యమంత్రి రేవంతే పార్టీకి శల్యసారథ్యం వహించారని రాహుల్ బలంగా నమ్ముతున్నారని ఢిల్లీ సర్కిల్స్‌లో జోరుగా చర్చసాగుతున్నది.
తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకుగాను కనీసం 15 స్థానాలను గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం అప్పట్లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును రంగంలోకి దించి.. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయించిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అంతర్గతంగా చేయించిన ప్రైవేటు సర్వే సంస్థలు కూడా దాదాపు 15 స్థానాల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని నివేదికలు ఇచ్చినట్టు సమాచారం.
ప్రధానంగా కాంగ్రెస్ ఓడిపోయిన అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు పట్టుగొమ్మల్లాంటివని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. కానీ ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, క్రాస్‌ఓటింగ్ కొంప ముంచిందని వారు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పట్నం సునీతామహేందర్‌రెడ్డి మొదటినుంచీ చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి పెంచుకున్నారు. ఆ మేరకు వారు క్షేత్రస్థాయి కార్యకర్తల స్థాయిలో సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు చెప్పుకుంటూ నియోజకవర్గంలో తిరిగారు. అట్లాగే గడ్డం రంజిత్‌రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. కానీ తీరా ఎన్నికలవేళ పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి మల్కాజ్గిరి, గడ్డం రంజిత్‌రెడ్డికి చేవెళ్ల నుంచి టికెట్ ఇవ్వడంతో ఇద్దరి పరిస్థితి ఒడ్డున పడ్డ చేపతీరు అయ్యింది. ‘లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్‌రెడ్డికే అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అప్పటికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరునెలలే కావడం, రేవంత్‌రెడ్డిపై ఉన్న సానుకూలత.. ఢిల్లీ నాయకత్వాన్ని నమ్మేలా చేసింది. మాలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులే కాదు, టికెట్ల ఇచ్చిన విధానం చూసి అభ్యర్థులే షాక్ అయ్యారు. తేరుకునే లోపే ఎన్నికలు ముగిసి.. 8 ఎంపీ స్థానాల్లో పార్టీ ఓడిపోయింది. అలా ఎందుకు జరిగిందో అప్పట్లో అర్థం కాలేదు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ‘సునీతామహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి టికెట్లే ఓ ఉదాహరణ. ఇద్దరికీ నచ్చనప్పుడు పరస్పరం సెగ్మెంట్లు మార్చుకునే అంశాన్నైనా పార్టీ నాయకత్వం పరిశీలించవచ్చు. కానీ అలా జరగలేదు. ఒక్కసారిగా ఇద్దరి టికెట్లను ఎందుకు మార్చారనేది అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత తెలిసిందేమిటంటే.. ఆ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని బీజేపీకి సానుకూలంగా మలచి, ఆ పార్టీ గెలుపును సునాయాసపరిచేందుకేనని అప్పట్లో జరిగిన ప్రచారం అబద్ధం కాదని అర్థమైంది.
టికెట్లను రాత్రికి రాత్రి మార్చడం ఓ పథకం ప్రకారం సాగిందని.. తమను నమ్మించి, గట్టిపోటీ ఇవ్వలేని స్థితిలోకి ఎంపీ అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగానే నెట్టారని కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతున్నదట. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీతో గెలిచేదని, కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతను గెలిపించడం కోసమే అన్నట్టు కార్పొరేటర్ స్థాయి నేతకు ప్రమోషన్ ఇచ్చి పార్లమెంటుకు నిబబెట్టారని కాంగ్రెస్ పార్టీ రివ్యూలో బయటికి వచ్చినట్టు చెప్తున్నారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి తాడి జీవన్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త చేసిన సర్వేల్లో తేలినట్టు నివేదికలు ఉన్నాయి. సహజంగానే ఈ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు ఉండటంతోపాటు, పార్టీ అధికారంలో ఉండటం కలిసి వచ్చే అంశమని పరిశీలకులు తొలుత అంచనా వేశారు. కానీ ఫలితాల్లో అనూహ్యంగా ఆ అభ్యర్థులు ఓటమిపాలుకావటం అధిష్ఠానాన్ని అశ్చర్యపరిచినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 8స్థానాల్లోనూ ఆయన వర్గానికి చెందిన నలుగురు ఎంపీలు మినహా.. మిగిలిన వాళ్లందరూ చెమటోడ్చి గెలిచినట్టుగా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. 70శాతం కాంగ్రెస్ అభ్యర్థులు వారి నియోజకవర్గాల్లో క్రాస్‌ఓటింగ్ గురయ్యారని పార్టీ రివ్యూలో తేలినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణ సీఎం ప్రభావం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా పడినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దేశ సార్వత్రిక ఎన్నికల కంటే ఆరునెలల ముందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణ మీద పడి ఇక్కడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే.. తెలంగాణ ప్రభావంతో ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఆశించదగిన సంఖ్యలో ఓట్లు సాధిస్తారని.. ఇది కూటమి, వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపోటముల మీద ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. ఆ మేరకు ఆం ధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో కోఆర్డినేట్ చేసుకుంటూ.. కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రయత్నించాలని అధిష్టానం రేవంత్‌రెడ్డిని ఆదేశించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇందుకోసం రాయలసీమతోపాటు కృష్ణా, గుం టూరు జిల్లాల్లోని నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే ఫలితాల్లో కాంగ్రెస్ ఒక్క సీటునూ సాధించలేకపోయింది. ‘సొంత పార్టీ అభ్యర్థులను విస్మరించి, అక్కడి కూటమి నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహరించినట్టు ఫలితాల తర్వాత కాంగ్రెస్ చేసుకున్న సమీక్షంలో తేలింది. తెలంగాణ నుంచి ఆర్థిక సహకారంతోపాటు, కీలకమైన ఇంటెలిజెన్స్ తోడ్పా టు, హైదరాబాద్‌లో స్థిరపడిన సెటిలర్స్‌ను కూటమి వైపు ప్రోత్సహించడం, వీళ్లంతా నేరుగా కూటమికే ఓటు వేయటంతో 21 ఎంపీ స్థానాలను టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి గెలుచుకొని ఎన్డీఏకు తిరుగులేని ఆధిక్యం ఇచ్చినట్టు కాంగ్రెస్ ముఖ్యుల పోస్టుమార్టంలో వెల్లడైంది. ఒకవేళ ఏపీ, తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకుని ఉంటే కేంద్రంలో అధాకారానికి మరింత చేరువయ్యేవాళ్లమని అధినాయకత్వం బలంగా నమ్ముతున్నది’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలిపారు. ‘మొదటి నుంచీ రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం పూర్తిగా నమ్మట్లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాయకత్వం ఆయనను ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడుతూ వస్తున్నారన్న విషయం క్రమంగా ప్రజలకూ అర్థమవడం మొదలైంది. ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం కలిగించారన్న భావనకుతోడు.. మోదీని బడేభాయ్ అనడం, రాష్ట్ర ప్రయోజనాల పేరిట కేం ద్రంతో మితిమీరిన సాన్నిహిత్యం నెరపడం, బీజేపీ నేతలతో రాసుకు పూసుకు తిరగడం వం టివి రాహుల్‌లో ఆగ్రహాన్ని పెంచి ఉండవచ్చు’ అని సీనియర్ పాత్రికేయుడొకరు విశ్లేషించారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల సరళిపై కాంగ్రెస్ అధినేత అంతర్గత విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. విభిన్న సర్వే సంస్థలు, కర్ణాటక పోలీస్ ఇంటెలిజెన్స్ వేర్వేరుగా సర్వే చేసినట్టు సమాచారం. రెండు రాష్ర్టాల్లో దాదాపు రెండు నెలలపాటు మకాం వేసి వాస్తవ పరిస్థితులపై ఆరా తీసి నివేదికలు రూపొందించినట్టు తెలిసింది.
ఈ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారాన్ని రా హుల్, తనకు సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్‌కు ఇచ్చి అధ్యయనం చేయాలని సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం. అప్పటికీ మీనాక్షిని ఏఐసీసీ తరఫున రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జ్గా నియమించలేదు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో ఏం జరిగిందో క్షేత్రస్థాయి వివరాలు ఇవ్వాలని రాహుల్ కోరినట్టు తెలిసింది. దీంతో ఆమె ఒక సాధారణ పార్టీ నేతగా తెలంగాణ పల్లెలు, పట్టణాలు తిరిగి సమాచారం సేకరించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆమె ఇచ్చిన నివేదికలో అభ్యర్థుల ఎంపికలో ఉద్దేశపూర్వక తప్పిదాలు, వెన్నుపోటు రాజకీయాలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీశాయని పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పటికీ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకతా లేదని, రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు రాహుల్ పీఎం కావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసి ఉంటే 16 స్థానాల్లో గెలిచే వాళ్లమని సోదాహరణంగా వివరించినట్టు తెలిసింది. పలు నియోజక వర్గాల్లో భారీగా క్రాస్‌ఓటింగ్ జరిగిందని ఆమె ప్రాథమిక ఆధారాలతో నిర్ధారించారని.. ప్రత్యక్షంగానే ప్రతిపక్ష పార్టీకి సహరించిన ఆధారాలు ఉన్నాయని ఆమె రిపోర్టు చేసినట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఇక పొరుగురాష్ట్రంలో చంద్రబాబునాయుడిని గెలిపించాలనే లక్ష్యంతో తెలంగాణ నుంచి ఆర్థిక తోడ్పాటుతోపాటు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థల సహకారం అందిందని.. కర్ణాటక నిఘా బృందాలు నివేదించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏపీఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఆంధ్రా సెటిలర్స్ హైదరాబాద్‌లో ఉన్నారని.. వీరికి సీఎం నుంచి సహకారం అందిందని వారు నివేదించినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ నివేదికలు అందిన తరువాత రాహుల్ రేవంత్‌రెడ్డిని దూరం పెట్టినట్టు చర్చించుకుంటున్నారు. ‘ఇండియా కూటమి ఓటమికి ప్రత్యక్ష, పరోక్ష సహకారం రేవంత్‌దేనని తేలిన వెంటనే సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలనే నిర్ణయానికి వచ్చినప్పటికీ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి అప్పటికి ఏడాది కూడా కాకపోవడంతో, ముఖ్యమంత్రిని మారిస్తే ప్రజలకు వ్యతిరేక సంకేతాలు ఇచ్చినట్టవుతుందని రాహుల్ తన అభిప్రాయాన్ని మార్చుకుని ఉంటారు’ అని మరో కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.
నిరుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్, రేవంత్ మధ్య తీవ్రమైన అంతరం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి దాదాపు 51సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్.. రాహుల్‌తో కలిసి ఇద్దరే నేరుగా ఫొటో దిగిన దాఖలాల్లేవు. ఇదే విషయమై విలేకరులు అడిగిన ప్రతిసారీ.. ‘గాంధీ కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. రాహుల్‌ను కలిసిన ప్రతిసారీ ఫొటో దిగాల్సిన అవసరం ఏమున్నది? తనకు ఆ సాన్నిహిత్యం లేకుండానే తనను పీసీసీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని చేశారా?’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. కానీ నాణేనికి మరోవైపు స్టోరీ వేరేగా ఉంది. ముఖ్యమంత్రిని చేసినందుకు తమకే వెన్నుపోటు పొడిచారని రాహుల్‌గాంధీ రగిలిపోతున్నారని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బీజేపీ నాయకత్వంతోనూ రేవంత్ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్టు రాహుల్ అనుమానిస్తున్నారని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఇటీవల ఇండియా కూటమి నేతల కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విందుకు రేవంత్‌ను పిలిచేందుకు మొదట్లో ఇష్టపడలేదట. ఏఐసీసీ కీలక నేత ఒకరు మధ్యవర్తిత్వం చేయగా..‘తెలంగాణలో ఏం జరుగుతున్నదో మీరు గమనిస్తున్నా రా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఊహించని ప్రశ్నతో కంగుతిన్న సదరు ఏఐసీసీ నేత రాహుల్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తను ఎంతకాలం ఉన్నా మనవాడు కాదని చెప్పినట్టు తెలిసింది.