ముషీరాబాద్, డిసెంబర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రజలకు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అత్యంత అవినీతితో కూడుకున్న హిల్ట్ పాలసీపై ఎన్నో అనుమానాలున్నాయని ఆరోపిస్తున్నారు. ఓ వైపు తెలంగాణలో హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థలు స్థలాలు లేక అద్దెభవనాల్లో కొనసాగుతున్నా పట్టింపులేదుగానీ, ప్రైవేట్ సంస్థలకు మాత్రం అప్పనంగా భూమి కేటాయించడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వాలు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కీలక క్లస్టర్లలో కేటాయించాయని, ఆ భూములు మొదట పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహించడానికి తక్కువ ధరకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించాయని గుర్తు చేశారు. ఇప్పుడు హిల్ట్ తో పారిశ్రామిక భూములను వాణిజ్య, నివాస జోన్లుగా మార్చుకోవడానికి అతితక్కువ ధరకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల భూమిని కేవలం 45 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ ఆమోదం ద్వారా అప్పగించాలని చూస్తున్న రేవంత్ ప్రభుత్వ విధానాలపై సమగ్రంగా విచారణ జరపాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు.