KP Vivekananda | కుత్బుల్లాపూర్, మార్చి 24: హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా జరిగినప్పటికీ.. నిధులు విడుదల చేయడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర పద్దులపై జరిగిన చర్చల సమయంలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ నగరానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీకి రూ.2654 కోట్లు కేటాయించి రూ.1200 కోట్లను మాత్రమే విడుదల చేశారని తెలిపారు. హెచ్ఎండీఏకు రూ.2,500 కోట్లు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. జలమండలికి రూ.3385 కోట్లు కేటాయిస్తే.. రుణాలకే రూ.800 కోట్లు ఇచ్చారని, ఇప్పటికే ప్రతిపాదించిన మెట్రో రూట్లను రద్దు చేశారని అన్నారు. మెట్రోకు రూ.1100 కోట్లు కేటాయిస్తే.. రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు కేటాయిస్తే .. కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీకి రూ.7582 కోట్లు అడిగితే..రూ.3100 కోట్లే కేటాయించారని సభలో లేవనెత్తారు. ఈ విధంగా గతేడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25 శాతమే విడుదల చేయడంపై నగరాభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ కార్మికుల వేతనాలు 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మిక పక్షపాతిగా కేసీఆర్ ఎంతో దాతృత్వంతో నాడు పారిశుద్ధ కార్మికుల జీతాలను 7 వేల నుంచి 12 వేలకు పెంచారని కేపీ వివేకానంద తెలిపారు. 2023 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 18 వేల రూపాయలు ఇస్తామని కార్మికులకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ కార్మికుల జీతాలను 18 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. రోడ్లను యంత్రాల ద్వారా ఊడ్చేందుకు రాంకీ సంస్థకు పనులను అప్పజెప్పినా, అది ఆచరణలో సాధ్యం కాలేదని అన్నారు. ప్రస్తుతం రోడ్లను కార్మికులే ఊడుస్తున్నా బిల్లులు మాత్రం రాంకీకి చెల్లిస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు.