ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంజిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులు, ఆరు కండ్లు ఉన్నవారు చేయలేనిది తాను ఒక్కడినే చేసి చూపించానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ‘రైతు ఆశీర్వాద సభ’లో సీఎంరేవంత్‌రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చె ప్పారు. రాష్ట్ర రైతులు, ప్రజలకు ఏవిధమైన ప్రయోజనం చేకూరుస్తారో చెప్పకుండా, బీఆర్ఎస్ నేతలను వ్యక్తిగతంగా దూషించడానికే సీఎం పరిమితం కావడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
రెండున్నర ఏండ్లలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చేసిన అభివృద్ధి కన్నా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రూ.వేల కోట్లతో ఖమ్మంజిల్లా చరిత్రలో ఎవరూ చేయలేని అభివృద్ధిని చేసి చూపించానని గుర్తుచేశారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోదని చెప్పారు. హరీశ్‌రావు బీజేపీ తో మంతనాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్న సీఎం.. దమ్ముంటే నిఘా విభాగంతో విచారణ జరిపించి ఎవరితో మాట్లాడారో తేల్చాలని సవాల్ విసిరారు. సీతారామ ప్రాజెక్టును ఖమ్మం వరప్రదాయినిగా మార్చే శక్తి బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు.