కీవ్, ఏప్రిల్ 10: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా బలగాలు విఫలమయ్యాయి. యుద్ధం మొదలై దాదాపు నెలన్నర గడిచినా కీలకమైన ఈ నగరాన్ని చేజిక్కించుకోలేక వెనుతిరిగిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం మార్చారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ జనరల్ అలెగ్జాండర్ డ్వోర్నికోవ్ను రంగంలోకి దించారు. సిరియాలో రష్యా ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఆయన్ను ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధానికి చీఫ్‌గా నియమించారు. తాజా పరిణామం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఉక్రెయిన్ మరింత తీవ్రమైన దాడులకు పాల్పడాలని, భిన్నంగా వ్యవహరించాలనే వ్యూహంతో రష్యా ఈ నియామకం చేపట్టిందని యూరోపియన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మొత్తంగా పర్యవేక్షించేందుకు రష్యా ఏ కమాండర్‌ను నియమించలేదు. ఉక్రెయిన్‌లో తొమ్మిది మంది రష్యా సైనిక జనరల్స్ మరణించారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని వెల్కీ బర్లుక్ నగరం గుండా దాదాపు 13 కి.మీ. మేర రష్యా మిలటరీ కాన్వాయ్ దక్షిణం వైపు బయల్దేరింది. దీనికి సం బంధించిన శాటిలైట్ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ విడుదల చేసింది. ఈ కాన్వాయ్‌లో సాయుధ వాహనాలు, ఫిరంగులతో కూడిన ట్రక్కు లు, ఇతర ఆయుధ సామగ్రి ఉన్నాయని తెలిపింది. వెల్కీ బర్లుక్ ఖార్కీవ్‌కు తూర్పున ఉంటుంది. మరోవైపు ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. దినిప్రోపెత్రోవ్స్క్లోని ఎయిర్‌పోర్టుతో పాటు మైకోలైవ్, ఖార్కీవ్ ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేసినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. బెటాలియన్ హెడ్‌క్వార్టర్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ లాంచర్లను ధ్వంసం చేశామని తెలిపింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో ఫోన్లో మాట్లాడారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు వేయాలని, తమకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఉక్రెయిన్‌లో అధిక సంఖ్యలో సైనికులను కోల్పోవడంతో, మాజీ సైనిక సిబ్బంది సేవల్ని రష్యా తీసుకొంటున్నట్టు బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. బుచా పట్టణంలో రష్యా సేనల పౌర హత్యలు, అకృత్యాలు వెలుగుచూసిన తర్వాత తాజాగా కీవ్ సమీపంలో ఒక సామూహిక సమాధిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో పదుల కొద్దీ మృతదేహాలు ఉన్నాయని, మొత్తం సంఖ్యను నిర్ధారించాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా సేనల దారుణాలకు అంతులేదు. వందల సంఖ్యలో పౌరులను పొట్టనపెట్టుకున్నది. తాజాగా యుద్ధంలో మరణించిన తన తల్లికి తొమ్మిదేండ్ల కూతురు ఉద్వేగభరితమైన లేఖ రాసుకున్నది. ‘ప్రపంచంలోనే బెస్ట్ మమ్మీ నువ్వు. నిన్ను మర్చిపోను. నువ్వు స్వర్గానికి వెళ్లి అక్కడ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా స్వర్గానికి వచ్చేందుకు మంచి అమ్మాయిగా ఉండేందుకు ప్రయత్నిస్తా. మనం అక్కడ కలుద్దాం’ అని ఓ ఉక్రెయిన్ అధికారి షేర్ చేసిన ఆ లేఖలో ఉంది.