అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేసీఆర్ మహిళా బంధు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులతో కలిసి ప్రముఖులు కేక్ కట్ చేశారు. మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఆదిలాబాద్ పోలీస్ ముఖ్య కార్యాలయంలో మహిళా సిబ్బందితో కలిసి ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి.., నిర్మల్‌లో ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేక్ కట్ చేశారు. నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహిళా వైద్య సిబ్బందిని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో మహిళలతో కలిసి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మానవహారం ఏర్పాటు చేశారు. మహిళలు కోలాటం ఆడారు, రంగోలి నిర్వహించారు. అనంతరం అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పారిశుధ్య కార్మికులు, వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందిస్తున్న సిబ్బందిని సన్మానించారు.