జైపూర్/మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 13 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనకు రాగా, ఇందారం బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు భారీగా గులాబీజెండాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సోమవారం వాటిని చెత్త ట్రాక్టర్లో తరలిస్తుండగా, బీఆర్ఎస్ నాయకులు అరికె సంతోశ్, మహమ్మద్ అమీరుద్దీన్, చిప్పకుర్తి శేఖర్, గండు సత్యనారాయణ అడ్డుకున్నారు. తోరణాలు, జెండాలను ఎవరు తొలగించమన్నారని ప్రశ్నించగా, సర్పంచ్ ఆదేశాల మేరకే జెండాలు తొలగించామని పారిశుధ్య కార్మికులు తెలిపారు. ఈ విషయమై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జెండాలను తొలగించే హక్కు కాంగ్రెస్ నాయకులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గులాబీ జెండాలను చూస్తేనే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని వారు పేర్కొన్నారు.
మంచిర్యాలలోనూ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా మంచిర్యాల పట్టణంతో పాటు చుట్టు పక్క ప్రాంతాల్లో రహదారులపై అలంకరించిన గులాబీ తోరణాలను మున్సిపల్ అధికారుల సూచనల మేరకు కార్మికులు హుటాహుటిన తొలగించారు. గులాబిమయమైన మంచిర్యాల నగరం కొత్త శోభను సంతరించుకోగా, మున్సిపల్ కార్మికులు చేయాల్సిన పనులను పక్కన పెట్టి ఇదేదో అత్యవసరంగా చేయాల్సిన పని అన్నట్లు వ్యవహరిరంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారపార్టీ నాయకుల ఒత్తిడి మేరకే ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తున్నది. వేరే ఇతర పార్టీలకు చెందిన జెండాలను తొలగించని కార్మికులు గులాబీ తోరణాలను మాత్రమే తొలగించడం చర్చనీయాంశంగా మారింది.