సినిమా పేరు: ప్రేమంటే
తారాగణం: ప్రియదర్శి, ఆనంది, సుమ, వెన్నెల కిశోర్..
దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
కెమెరా: విశ్వనాథరెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
నిర్మాతలు: పుస్కూర్ రామ్మోహన్రావు, జాన్వీ నారంగ్..
ప్రమోషన్ మొదలైన నాటినుంచి ‘ప్రేమంటే’ సినిమాపై ఆడియన్స్‌లో ఓ పాజిటీవ్ వైబ్ క్రియేటైంది. దానికి తోడు లియోన్ జేమ్స్ పాటలు కూడా జనబాహుళ్యంగా బాగా వినిపిస్తున్నాయి. ఖర్చును వెనుకాడని నిర్మాతలు పుస్కూర్ రామ్మోహన్రావు, జాన్వీ నారంగ్ ఈ చిత్రానికి నిర్మించడం.. యువతరానికి ఆకట్టుకునే ప్రియదర్శి, ఆనంది ఇందులో జంటగా నటించడం సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి పెరగడానికి కారణాలని చెప్పొచ్చు. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘ప్రేమంటే’ విడుదలైంది. మరి అందరి అంచనాలనూ ఈ సినిమా అందుకున్నదా? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ
అభిప్రాయాలు కలవక పెళ్లికి దూరంగా ఉంటున్న అమ్మాయి రమ్య(ఆనంది). సమస్యల కారణంగా పెళ్లి వద్దనుకుంటున్న అబ్బాయి మదన్మోహన్ అలియాస్ మది(ప్రియదర్శి). వీరిద్దరూ అనుకోకుండా ఓ పెళ్లిలో కలుస్తారు. వారి కలయిక ప్రేమగా, ఆ తర్వాత పెళ్లిగా పరిఢమిల్లుతుంది. తొలి నెల వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. కానీ తర్వాత నుంచి కష్టాలు మొదలవుతాయి. బాధ్యతలు రమ్యను ఆఫీస్‌కు నడిపిస్తాయి. సమస్యలు మదిని వ్యాపారం వైపుకు తరలిస్తాయి. అసలు సమస్య ఇక్కడే వచ్చిపడుతుంది. సీసీ కెమెరాలు, లాక్స్ సంబంధించిన బిజినెస్ మదిది. దీనికి సంబంధించిన వర్కంతా నైటే ఎక్కువ ఉంటుంది. దాంతో రమ్య ఆఫీస్ నుంచి ఇంటికి రావడం.. అదే టైమ్‌కి మది తన ఆఫీస్ వెళ్లిపోవడం.. ఈ కారణంగా వారి వైవాహిక జీవితం అసంతృప్తిగా తయారవుతుంది. ఇదిలావుంటే.. ఇంట్లో ఉన్న కొద్ది సమయంలో మది కదలికలు రమ్యకు అనుమానం కలిగిస్తాయి. తాను ఎవరితోనే రిలేషన్లో ఉన్నాడనే సందేహం రమ్యకు మొదలవుతుంది. అందుకు తగ్గట్టు సాక్ష్యాలు కూడా కనిపిస్తుంటాయి. దాంతో మదిని నిలదీస్తుంది రమ్య. ఇద్దరి మధ్య జరిగే గొడవలో అనుకోకుండా తన బిజినెస్‌కి సంబంధించిన రహస్యాన్ని బయటపెడతాడు మది. దాంతో రమ్య షాక్. అసలు మది చేస్తున్న బిజినెస్ ఏంటి? రమ్య ఎందుకు షాకయ్యింది? ఆ తర్వాత వీరిద్దరి వైవాహిక జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అసలు చివరికి ఏం జరిగింది? అనేది అసలు కథ.
విశ్లేషణ
ఈ సినిమా ఓ విధంగా హీరోయిన్ కథ. ఈ కథకు ప్రధానమైన సోల్ హీరోయిన పాత్రే. చెడ్డవాడైన భర్తతో కలిసి చెడ్డపనులు చేసే భార్యల కథలు విన్నాం. సకలగుణసంపన్నుడైన భర్త అడుగుజాడల్లో నడుస్తూ.. సుగుణవతిగా ఇంటిని చక్కబెట్టే భార్యల కథల్ని కూడా చూశాం. ఇందులో హీరోయిన్ కూడా ఓ విధంగా అలాంటి భార్యే. కాకపోతే ఇదోరకం. సాధారణంగా సమస్యల కారణంగా భర్త దొంగగా మారితే.. ఏ భార్యలైనా అతన్ని మార్చుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ భార్య అలా కాదు. భర్త దొంగని తెలిసి.. భర్త సమస్యలను అర్థం చేసుకొని.. భర్తకు సాయంగా తాను కూడా దొంగలా మారుతుంది. ఓ విధంగా ఈ పాయింట్ నిజంగా కొత్తదే అనాలి. ఇందులో హీరోయిన్ వీక్నెస్ భర్తను అమితంగా ప్రేమించడమే. భర్త బలహీనతను కూడా ఇష్టపడటమే. నిజానికి అతడు చెడ్డవాడేం కాదు. తాను దొంగతనాలు కూడా యతికల్గా చేస్తాడు. అందుకే.. తాను కూడా భర్తతో కలిసి దొంగగా మారుతుంది. ఈ పాత్రలో ఆనంది నిజంగా అదరగొట్టిందనే చెప్పాలి. ఇందులో ఆనంది పోషించిన రమ్య పాత్ర జనాలకు పడితే.. సినిమా హిట్. పట్టకపోతే సినిమా ఫట్. ఈ విషయం దర్శకుడు నవనీత్ శ్రీరామ్ కొంతమేర సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఓ వైపు గమ్మత్తైన ఈ కథను వినోదంగా ప్రజెంట్ చేస్తూనే.. మరోవైపు ఆ జంట మధ్య ఉండే పరస్పర ప్రేమానురాగాలను తెరపై చక్కగా ప్రజెంట్ చేశాడు దరశకుడు నవనీత్ శ్రీరామ్. ఆనంది, ప్రియదర్శి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ సినిమా బావున్నాయి. ప్రియదర్శి, అతని ఫ్రెండ్స్ కాంబినేషన్ సీన్స్ అన్నీ శబ్ధ కాలుష్యాన్ని తలపిస్తాయి. అలాగే.. ఇందులో సుమ, వెన్నెల కిశోర్ కథలో కీలకమైన పాత్రలు పోషించారు. ఇద్దరూ తమ తమ పాత్రలను బాగానే రక్తి కట్టించారు కానీ.. వీరిద్దరి కాంబినేషన్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోవు. మొత్తం సినిమా ఆద్యంతం వినోదంగానే సాగింది.
నటీనటులు
ప్రియదర్శి చక్కటి జోష్‌తో అద్భుతంగా నటించాడు. అంతర్మథనం, సంఘర్షణలతో కూడుకున్న పాత్ర తనది. అందుకు తగ్గట్టే చక్కగా అభినయించాడు. ఇక ఆనంది పోషించిన రమ్య పాత్ర లక్ష్యం ఒక్కటే. తన భర్తతో కలిసి తన జీవితం సంతోషంగా సాగాలి. అలా జరగాలంటే తన భర్త బాధ్యతలన్నీ తీరిపోవాలి. దానికోసం తను ఏమైనా చేస్తుంది. తనకు భర్త తప్ప మరో లోకం ఉండదు. ఆ ఇష్టాన్ని తెరపై అద్భుతంగా చూపించింది ఆనంది. సమస్యల్నీ అధిగమించేందుకు తను చూపించే తెగువ తెరపై ముచ్చటగా అనిపిపిస్తుంది. సుమ, వెన్నెల కిశోర్ తమ పాత్రలను ఎప్పటిలాగే రక్తికట్టించారు. మిగతా నటీనటలంతా పరిథిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా
దర్శకుడు రాసుకున్న కథ కొత్త ఉంది. కథనం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఫ్రెండ్స్ ట్రాక్, సుమ, వెన్నెల కిశోర్ ట్రాక్‌ల విషయంలో ఇంకాస్త పేపర్ వర్క్ చేస్తే బావుండేది అనిపించింది. విశ్వనాథరెడ్డి విజువల్స్ బావున్నాయి. జేమ్స్ లియోన్ పాటలు, నేపథ్య సంగీతం కూడా అభినందనీయంగానే ఉన్నాయి. మొత్తంగా ఇదోరకం ప్రేమకథ. ఇదోరకం ఫ్యామిలీ డ్రామా. ప్రేమంటే ఇలా ఉంటుందా? ప్రేమంటే ఇలా కూడా ఉంటుందా? అని తెలియజెప్పే సినిమా ఇది.
బలాలు
కథ, కథనం, హీరోహీరోయిన్ల నటన..
బలహీనతలు
కామెడీ ట్రాక్స్.. కొన్నీ సీన్స్ ఓవర్‌గా అనిపించడం..
రేటింగ్ – 2.75/5